
- కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్లో సీఎం
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకోవడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టాలని, ఆ తర్వాతనే ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్ లుగా ఎవరు అవుతారనేది పీసీసీ తీసుకునే నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. హైకోర్టు తీర్పుకు ముందు పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల పార్టీ నేతలకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఇందులో పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయాలని నేతలను ఆదేశించారు. వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కావడంతో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. కోర్టు తీర్పు ఎలాగూ తమకు అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. అన్ని జిల్లాల పార్టీ నేతలను పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా దక్కకుండా కాంగ్రెస్ అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేలా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ఓట్ చోరీ’పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర నేతలు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఢోకా లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తామని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా నేతలకు పలు సూచనలు చేశారు.