పీవీకి భారతరత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం

పీవీకి భారతరత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు భారతరత్న రావడం దేశ ప్రజలందరికీ గర్వ కారణమని సీఎం రేవంత్‌‌ రెడ్డి అన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలో ఇండియాను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నిలబెట్టిన ఘనత పీవీకి దక్కుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో రేవంత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల దాష్టీకంపై పోరాటం చేసి, నాటి హైదరాబాద్ రాష్ట్రం విముక్తి పొందడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ గుర్తు చేశారు. పీవీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆయన ప్రధాని కావడానికి సహకరించిన సోనియా గాంధీకి అసెంబ్లీ, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు.

ఇదే అంశంపై శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆయన కొనియాడారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు తదితరులు పీవీకి భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, అసెంబ్లీ లాబీలోని మెంబర్స్ లాంజ్​లో ఉన్న ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవిని ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కేంద్రం నిర్ణయం హర్షనీయం

ముగ్గురికి భారత రత్న ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. మోదీకి కృతజ్ఞతలు. పీవీ తన దూరదృష్టితో ఆర్థిక పురోగతికి బాటలు వేశారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో అపారమైన సహకారం అందించారు. రైతులు, వ్యవసాయ రంగం సర్వతోముఖ ప్రగతికి కృషి చేసిన చరణ్​సింగ్​కృషి మరువలేనిది.  వ్యవసాయ పరిశోధన రంగంలో స్వామినాథన్​ప్రయత్నాలు లక్షలాది మంది ప్రజలు ఆకలి తీర్చింది. 
‑ జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

 కేంద్రానికి కృతజ్ఞతలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌‌ను కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
‑ కేసీఆర్​, మాజీ సీఎం

మోదీ సంస్కారానికి నిదర్శనం

పార్టీలకు అతీతంగా పీవీ సేవలను గుర్తించారు. ప్రధాని మోదీ సంస్కారానికి ఇది నిదర్శనం. పీవీకి ‘భారతరత్న’ ఇవ్వడంతో ఆ పురస్కారానికే విలువ పెరిగింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది. దేశంలో నూతన  సంస్కరణలను తెచ్చారు. ఆయన్ను గౌరవించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. భయం, మొహమాటం లేకుండా ప్రజల క్షేమమే తన జీవిత ధ్యేయంగా జీవించారు. కొంచెం లేటయినా ఫరవాలేదు కానీ భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉంది.
‑ సురభి వాణీదేవి, పీవీ కుమార్తె