ధరణి కమిటీతో ఇవాళ సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూ

ధరణి కమిటీతో ఇవాళ సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూ
  • మధ్యంతర రిపోర్ట్​ వివరాలపై రేవంత్​కు వివరించనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ కమిటీతో సీఎం రేవంత్​ రెడ్డి శనివారం రివ్యూ చేయనున్నారు. ధరణిలో నిలిచిపోయిన పెండింగ్​ అప్లికేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల అప్లికేషన్లు వివిధ సమస్యలతో ధరణిలో పెండింగ్​లో ఉన్నాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధరణిలో అమ్మకాలు, కొనుగోళ్లు తప్ప ఇతరత్రా అప్లికేషన్లు వేటిని కూడా ప్రాసెస్​  చేయలేదు.

ధరణి కేంద్రంగా భారీ దందా నడిచిందనే ఆరోపణలు ఉండడం, వేల ఎకరాల ప్రభుత్వ భూములు గల్లంతు కావడం వంటి  అక్రమాలపై ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ధరణి పోర్టల్​పై కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ శాఖల అధికారులు, కలెక్టర్లతో ఈ కమిటీ సమావేశమై ధరణి సమస్యలపై అధ్యయనం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన అంశాలను సీఎం రివ్యూలో కమిటీ వివరించనుంది.

శనివారం జరిగే సమావేశంలో నిషేధిత జాబితాలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, అడ్‌‌హాక్‌‌  ల్యాండ్‌‌  ట్రైబ్యునల్స్‌‌  ద్వారా పరిష్కారమైన కేసులు, సంబంధిత అంశాలు, సాదాబైనామా దరఖాస్తుల పరిస్థితి, ఆర్‌‌ఎస్‌‌ఆర్‌‌/సేత్వార్‌‌కు సంబంధించిన సమస్యలు, రిజిస్ట్రేషన్లలో సమస్యలు, ఇనాం, జాగీర్‌‌  వంటి వాటిపై పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, షెడ్యూల్డ్‌‌  ఏరియాల్లో భూముల సమస్యలు, రెవెన్యూ–-అటవీ శాఖల మధ్య విభేదాలు, దేవాదాయ, వక్ఫ్‌‌  బోర్డుకు సంబంధించిన సమస్యలు, భూపరిపాలనకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే వీటన్నింటిపై అధ్యయనం చేసిన ధరణి కమిటీ.. మధ్యంతర సిఫారసులను ప్రభుత్వానికి నివేదించనుందని తెలిసింది. సీఎం రివ్యూలో జిల్లా కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొనే అవకాశం ఉంది.