- మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 100 శాతం నిధులు
- చెరువుల ఆక్రమణల తొలగింపులో ఇండ్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం
- భవిష్యత్ తరాల మనుగడ కోసమే మూసీ రివర్ ఫ్రంట్.. ఎవరూ అడ్డుపడొద్దని రిక్వెస్ట్
- కూకట్‌పల్లి నల్లచెరువును ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలకతీతంగా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూటికి నూరు శాతం నిధులు ఇస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి వేదికలపై రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్లచెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి, గంగాహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను కాలుష్య, వరదరహిత విశ్వనగరంగా మార్చేందుకే కబ్జాల కోరల నుంచి జలవనరులకు విముక్తి కల్పిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాల మనుగడ కోసమే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, దీనికి ఎవరూ అడ్డుపడొద్దని కోరారు. మూసీ నదిని పునరుద్ధరించకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ రివర్‌ఫ్రంట్లను అభివృద్ధి చేయలేదా? అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నారని నిలదీశారు. మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడమంటే తెలంగాణకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఈ ప్రక్రియలో ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు మన నగరానికి రాకూడదనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఉద్దేశం పేదల ఇండ్లు కూలగొట్టడం కాదని, ప్రకృతి విపత్తుల నుంచి వారి జీవితాలను కాపాడటమేనని తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపులో నిర్వాసితులైన వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.
చెరువుల వద్దే ఆట స్థలాలు, మహిళలకు ఉపాధి
హైడ్రాను తీసుకువచ్చి చెరువుల ప్రక్షాళన మొదలుపెట్టినప్పుడు తనపై ఎంతోమంది ఎన్నో రకాల తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తన ఆలోచనలో, సంకల్పంలో ఎలాంటి దురుద్దేశం లేదు కాబట్టే ఆ ఆరోపణలన్నింటినీ అత్యంత సహనంతో, మౌనంగా భరించానని చెప్పారు. సున్నం చెరువు, నల్లచెరువుల దగ్గర జరిగిన అభివృద్ధిని, ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తుంటే ఆ తిట్లు తనకు దీవెనలుగా మారుతున్నాయన్నారు.
‘‘జనాభా పెరిగిన కొద్దీ వసతులు లేక కొందరు పేదలు ప్రభుత్వ స్థలాల్లో, చెరువు శిఖాల్లో గుడిసెలు వేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వాటిని తొలగించినప్పుడు వారు బాధపడి ఉండొచ్చు. కానీ ఆ స్థలాల్లోకి వరద నీరు వచ్చి భవిష్యత్తులో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఎవరైనా నిర్వాసితులైతే, వారి వివరాలు సేకరించి అర్హులందరికీ పక్కా ఇండ్లు ఇప్పించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తీసుకోవాలి. బస్తీలు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ఆక్రమించుకుంటే.. వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది” అని వ్యాఖ్యానించారు.
నిజాంపేటలో గతంలో వచ్చిన వరదలను స్వయంగా చూశానని, నీళ్లు వెళ్లే దారి లేకపోవడం వల్లే ఆ దుస్థితి తలెత్తిందని సీఎం వివరించారు. బతుకమ్మ పండుగలు చేసుకోవడానికే కాకుండా సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో వాకింగ్ చేసుకునేందుకు ఈ లేక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయన్నారు. ఇక్కడి వాకింగ్ ట్రాక్‌ల వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. చెరువుల వద్ద సురక్షితమైన ఆటస్థలాలను, షటిల్ కోర్టులను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
మల్కాజ్‌గిరిని డెవలప్ చేస్తా..
మల్కాజ్‌గిరిలో అవసరమైన మౌలిక వసతుల అంచనాలు రూపొందిస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న కాలంలో నిధుల లేమి వల్ల తాను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయానని తెలిపారు. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదంతో సీఎం స్థాయికి చేరినందున, ఆనాటి లోటును తీరుస్తూ ప్రతి కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. తుమ్మిడికుంట, ఫాక్స్ సాగర్ తదితర స్థానిక చెరువులన్నింటినీ ఇదే తరహాలో ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారావు అడిగిన నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఇందిరమ్మ కాలనీలో వాటర్ పైప్‌లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆ పనుల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించినా అవి పూర్తికాలేదని, ఇప్పుడు మన ప్రభుత్వమే ఉన్నందున పూర్తిచేస్తామని చెప్పారు. ఐడీపీఎల్ పరిశ్రమ సమయంలో వలస వచ్చిన కూలీలు, పేదలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
