- రామప్ప, కాకతీయుల శిల్పకళా వైభవంతో డిజైన్లు
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్పనులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రామప్ప, కాకతీయుల శిల్పకళా వైభవంతో డిజైన్లు రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోని ‘తెలంగాణ భవన్’ భవనాలు మన నేల సంస్కృతి, చారిత్రక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకే పరిమితం కాకుండా రాబోయే తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ప్రజా రవాణా, పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి శక్తులుగా మారే ఈ నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు, ఢిల్లీ తెలంగాణ భవన్ శైలి ప్రాచీన వారసత్వాన్ని చాటాలని సీఎం ఆదేశించారు. ఇందుకు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక కాకతీయ కళాతోరణం వాస్తు కళలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
నల్గొండ పిల్లలమర్రి ఆలయ శిల్పకళా రీతులను సైతం లోతుగా అధ్యయనం చేసి కొత్త నిర్మాణాల్లో పొందుపరచాలని సూచించారు. సమీక్షలో ప్రదర్శించిన ప్రాథమిక ఆకృతులను పరిశీలించిన సీఎం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పలు మార్పులు చెప్పారు. ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డితో పాటు అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టుల సలహాలు తీసుకుని తుది ఆకృతులు ఖరారు చేయాలన్నారు. ఢిల్లీ వేదికగా ఏర్పాటయ్యే తెలంగాణ భవన్ జాతీయ స్థాయిలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటాలని సీఎం స్పష్టం చేశారు.
