దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం: సీఎం రేవంత్ రెడ్డి

దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం: సీఎం రేవంత్ రెడ్డి
  • ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది: సీఎం రేవంత్ 
  • కాకా కుమారులు వివేక్, వినోద్.. లవకుశులు
  • దేశానికి గాంధీ కుటుంబం ఎలానో.. తెలంగాణకు కాకా కుటుంబం అలా..
  • ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడూ ఎమ్మెల్యే కావొచ్చు
  • సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు
  • ఘనంగా అంబేద్కర్ విద్యాసంస్థల గ్రాడ్యుయేషన్ డే, అలూమ్నీ మీట్ 

హైదరాబాద్, వెలుగు: దేశ నిర్మాణంలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. కాకా వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్​లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆవరణలో అలూమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదని, సమాజానికి ఎంత పంచామనేది ముఖ్యమని అన్నారు. ఆ సామాజిక బాధ్యతను కాకా నిర్వర్తించారని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. కాకా కుమారులు వివేక్, వినోద్ ను చూస్తే రామాయణంలో లవకుశులను చూసినట్టు అనిపిస్తున్నదని.. సామాజిక బాధ్యతలో కాకా కుటుంబం ముందున్నదని అన్నారు.

 ‘‘1973లో అంబేద్కర్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. గత 50 ఏండ్లలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేశారు. దేశానికి ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లను అందించారు. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల ఆలోచనంతా సంపాదనపైనే ఉంటున్నది. ఈ ఏడాది వెయ్యి కోట్ల లాభం సంపాదిస్తే, వచ్చే ఏడాది రెండు వేల కోట్లు సంపాదించడం ఎలా అనే టార్గెట్ పెట్టుకుంటున్నాయి. కానీ కాకా వెంకటస్వామి కుటుంబం అలా కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రతిఏటా దాదాపు 3 వేల మందికి విద్యను అందించి, వారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నది’’ అని కొనియాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలోనూ కాకా ఫ్యామిలీ ముందున్నది. కాకా ఢిల్లీలోని తన ఇంటిని కాంగ్రెస్ ఆఫీసుకు ఇచ్చారు. ఇప్పటికీ కాకా పేరుతోనే ఆ ఆఫీస్ ఉంది. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో.. తెలంగాణకు కాకా కుటుంబం అలా” అని అన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.  

దేశ నిర్మాణ బాధ్యత మనదే.. 

డబ్బులుంటేనే రాజకీయాల్లో రాణిస్తామనే ఆలోచనలు పక్కన పెట్టాలని విద్యార్థులకు సీఎం రేవంత్ సూచించారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తే తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చని, అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని చెప్పారు. సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని స్టూడెంట్లకు సూచించారు. “డాక్టర్, లాయర్, ఇంజినీర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఎంత కఠోరమైన దీక్షతో చదువుతామో.. అంతే కఠోరమైన దీక్షతో ప్రజా జీవితంలోకి రావాలి. ఈ దేశం మనది.. దీన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా, మంచి పరిపాలన అందించాలన్నా.. బడుగు బలహీన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్లను కూడా కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చింది” అని తెలిపారు. ‘‘ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 57 మంది కొత్త వాళ్లున్నారు. కాంగ్రెస్ తరఫున 64 మంది గెలిస్తే, వారిలో 37 మంది మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవాళ్లే ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  4 కోట్ల మంది ఆశీర్వాదంతో సీఎం అయ్యాను” అని చెప్పారు.  

జడ్పీటీసీ నుంచి సీఎం అయ్యా.. 

తాను జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ చెప్పారు. ‘‘నేను 2006లో జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తా అని చెప్పినా తీసుకోలేదు. ప్రజల్లో ఉండి విజయం సాధించాను. స్థానిక సంస్థల ప్రతినిధితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశాను. ప్రజలు గుండెల్లో పెట్టుకోవడంతోనే నేను సీఎం అయ్యాను” అని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ‘‘కళాశాల సమయంలోనే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలి. డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదు” అని సూచించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని,  విద్యార్థులంతా మంచిగా చదువుకుని సర్కార్ కొలువు సాధించాలన్నారు. 

కాకా బాటలోనే ఆయన కుటుంబం: పొన్నం

కాకా కార్మికుల సంక్షేమం కోసమే కాకుండా పేద విద్యార్థుల కోసమూ పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదే దారిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందుకువెళ్తున్నరని చెప్పారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యతోనే అన్ని నెరవేర్చుకోవచ్చనే కాకా ఆలోచన గొప్పదని చెప్పారు. తాము నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నామని ఎమ్మెల్యే, అంబేద్కర్​ విద్యాసంస్థల సెక్రటరీ వినోద్ అన్నారు. ‘‘తెలంగాణ సాధించడమే కాకా కలగా ఉండేది. ఆయన తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ వచ్చాకే కన్నుమూశారు” అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్,  గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరామారావు, రాజ్​ ఠాకూర్, నాగరాజు, మాజీ మంత్రి శంకర్ రావు, ఏఐసీసీ సెక్రటరీ విష్ణు, డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, ప్రొఫెసర్లు లింబాద్రి, పురుషోత్తం, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, విమలక్క, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసమే అంబేద్కర్ విద్యాసంస్థలు..
   
పేదల కోసమే అంబేద్కర్ విద్యాసంస్థలను మా నాన్న కాకా వెంకటస్వామి ఏర్పాటు చేశారు. ఆయన కష్టపడి ఎదిగిన వ్యక్తి. అంబేద్కర్​ను ఎలాగైనా కలవాలనే ఆశతో ఉండేవారు. మహదేవ్ సింగ్ ద్వారా అంబేద్కర్​ను కలుసుకున్నారు. దేశంలో సివిల్ సప్లయ్స్ మంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసింది కాకానే. కార్మిక శాఖ మంత్రిగా పింఛన్ సిస్టమ్ తీసుకొచ్చింది కూడా ఆయనే. కాకా స్ఫూర్తితోనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేసీఆర్​పై నేను పోరాడాను. వెంకటస్వామికి రాష్ట్రపతి కావాలనే కోరిక ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఏపీ నేతలు ఆ పదవి దక్కకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు కలలు కనాలి.. వాటిని సాధించేందుకు కష్టపడి పని చేయాలి.   
- వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే, 
అంబేద్కర్​ విద్యాసంస్థల చైర్మన్ 

కార్పొరేట్​కు దీటుగా విద్యనందిస్తున్నం..   

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అంబేద్కర్ విద్యాసంస్థల్లో విద్యనందిస్తున్నం. కాకా వెంకటస్వామి ఆనాటి పరిస్థితుల్లో కేవలం టెన్త్​ మాత్రమే చదివారు. దీంతో పేద పిల్లలందరికీ చదువు అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 1973లో అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారు. మేము కాకా చూపిన దారిలోనే నడుస్తున్నాం.. ఇకపైనా నడుస్తాం. అంబేద్కర్ విద్యాసంస్థల్లో చదివిన చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కాకా వర్థంతి సందర్భంగా ఏటా ఆయనకు నివాళిగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తాం. ఈ విద్యాసంస్థల్లో డొనేషన్ లేకుండా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నం. మా కాలేజీలో చదివిన ఆటో డ్రైవర్ కూతురు ఇంటర్​లో స్టేట్ ర్యాంక్​ సాధించింది. వాచ్ మెన్ కూతురు టెన్త్​లో టాపర్​గా నిలిచింది. లా కాలేజీకి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. 
- సరోజా వివేక్, విద్యాసంస్థల కరస్పాండెంట్