
- వస్తున్నది రూ. 18,500 కోట్లే.. లోటు పూడ్చుడు కష్టమైతుంది
- కేసీఆర్ చేసిన అప్పు వడ్డీలకు రూ. 16 వేల కోట్ల అప్పు తెచ్చినం
- ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే కష్టమైది.. అర్థం చేసుకోవాలె
- ఈ ప్రభుత్వం మీది.. మీరిస్తేనే నాకు కుర్చీ వచ్చింది.. ఎట్ల చేయాల్నో మీరే చెప్పండి
- మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్త.. కూసోని మాట్లాడుకుందాం
- కార్మిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఖజానా అంతా లూటీ చేసినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఆనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కొంత వెసులుబాటు అవసరమని అన్నారు. ఇవాళ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం మాట్లాడారు. ఖజానాలో కాసుల్లేకున్నా ఒక్క పథకం కూడా ఆపలేదని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా అన్ని పథకాలు అమలు చేస్తున్నా.. శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవని, మంత్రాలకు చింతకాయలు రాలవనే విషయం కేసీఆర్ గ్రహించాలని సీఎం అన్నారు. కపట నాటక సూత్రధారి మళ్లీ బయల్దేరిండని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన గతంలో చెప్పినట్టు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదని, కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా అవకాశం ఇవ్వాలని సీఎం అన్నారు.
కేసీఆర్ కడుపునిండా విషం
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ కడుపునిండా విషం పెట్టుకొని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. పదేండ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అన్నారు. ఆర్థిక ఉగ్రవాదం కారణంగా పేదవాడు మరింత నిరుపేదగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి పేపర్లు, టీవీలు, ఫాంహౌస్ లు వచ్చాయని అన్నారు. ఇప్పుడు దిగిపోగానే... వచ్చి నాకు ఇవ్వండి నేను సక్క దిద్దుతా..? అని మాట్లాడుతున్నారని అన్నారు. గత పదేండ్లలో ఎవరైనా కష్టమున్నోళ్లు బయటికొచ్చి చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని అన్నారు.
ఆర్థిక విధ్వంసం జరిగింది.. పత్యం పాటిద్దాం
కేసీఆర్ చేసిన నిర్వాకానికి ఆర్థిక విధ్వంసం జరిగిందని సీఎం అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పత్యం పాటించాల్సిన ఈ సమయంలో సమ్మెలకు వెళ్లడం భావ్యం కాదని రిక్వెస్ట్ చేశారు. కార్మికులు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 22,500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని రాష్ట్రానికి వచ్చేది 18,500 కోట్ల రూపాయలేనని, వాటిని ఎలా సర్దాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కట్టేందుకే 16 వేల కోట్ల అప్పులు తెచ్చామని సీఎం చెప్పారు. ఈ 15 నెలల నుంచి తనతోపాటు, తన సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం చెప్పారు. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దని, వాళ విషపు చూపుల్లో చిక్కుకోవద్దని అన్నారు.
గిగ్ వర్కర్స్ పాలసీ దేశానికి రోల్ మోడల్
త్వరలోనే గిగ్ వర్కర్ల పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ పాలసీ దేశానికే రోల్ మోడల్ గా నిలువబోందని అన్నారు. వాళ్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేయబోతున్నామని అన్నారు. గల్ఫ్ లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెల్లిస్తోందని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చెప్పారు.
సమ్మె వద్దు
‘ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఒకసారి ఆలోచించండి.