పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్

పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్
  • 27 నెలల్లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్​ఎఫ్ ​కింద  ఖర్చు చేసినం: సీఎం రేవంత్​రెడ్డి
  • ఆరోగ్యశ్రీకి రూ.2,408 కోట్లు, సీఎంఆర్​ఎఫ్​ కింద రూ.2,046 కోట్లు
  • సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్​తో 10 వేల బెడ్స్ ​అందుబాటులోకి తెస్తం
  • 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమావైద్య విద్యార్థుల క్లినికల్ అనుభవం కోసం..  
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ కేసులు,సర్జరీలు చేసే ప్రభుత్వ డాక్టర్లకు ఇన్సెంటివ్స్ 
  • పేదల విద్య, వైద్యం నిధులకు రాజీపడం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యం కోసం రూ.4,454.51 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2,408.51 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) ద్వారా రూ.2,046 కోట్లు వెచ్చించి పేదలకు అండగా నిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి తమకు ఆరోగ్యశ్రీ బకాయిలు వారసత్వంగా వచ్చినా, ఎక్కడా వెనుకడుగు వేయకుండా పేదవాడి ప్రాణాలను కాపాడడమే పరమావధిగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.

 గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడుతున్నాయని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని.. కానీ, వాస్తవానికి తాము రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఆరోగ్యశ్రీ కేవలం రూ.5 లక్షలకే పరిమితం కాగా.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రూ.10 లక్షలకు పెంచి సామాన్యులకు భరోసా కల్పించామన్నారు. ప్రతి నెలా సగటున 184 కోట్ల రూపాయల వైద్య సేవలను ప్రజలు ఆరోగ్యశ్రీ కింద పొందుతున్నారని.. ఇది గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని సీఎం వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో వైద్యరంగం సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, ప్రతి ప్రాణం విలువైనదేనని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తీర్చుకుంటూనే, మరోవైపు నిరంతరాయంగా ప్రస్తుత క్లెయిమ్‌‌‌‌‌‌లను పరిష్కరిస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సీఎం తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధుల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బకాయిలు పెట్టిందే బీఆర్​ఎస్

బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.600.27 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను తమ నెత్తి మీద పెట్టి అధికారం నుంచి దిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.360.16 కోట్ల మేర పాత ప్రభుత్వం బకాయి పడిందని సభకు వివరాలు సమర్పించారు. అయినప్పటికీ, తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.2,408.51 కోట్లను కేవలం ఆరోగ్యశ్రీ కోసమే చెల్లించిందని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,480.52 కోట్లు ఈ 27 నెలల కాలంలో విడుదల చేసినట్టు గణాంకాలను వివరించారు. నెలకు సగటున ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.34 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.55 కోట్లు ఇస్తూ పేదలకు వైద్యం అందేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బకాయిల్లో కూడా ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులకే ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

మొత్తం రూ.727.75 కోట్ల అవుట్‌‌‌‌స్టాండింగ్‌‌‌‌లో ప్రభుత్వానివి రూ.496.31 కోట్లు ఉంటే.. ప్రైవేట్ ఆస్పత్రులవి కేవలం రూ.231.44 కోట్లు మాత్రమేనన్నారు. దీన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభు త్వం నిధులు ఇవ్వడం లేదన్న వాదనలో వాస్తవం లేదని, పేదలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో నెలకు రూ.102 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చేవని.. ఇప్పుడు పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వల్ల నెలవారీ బిల్లులు రూ.184 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగినా పేదల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇన్సూరెన్స్‌‌‌‌లో మరిన్ని వ్యాధులను కూడా చేర్చామన్నారు. నిధుల విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పాత బకాయిలను కూడా క్రమపద్ధతిలో చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు.

గతలో జరిగిన అక్రమాలపై విచారణ

ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌‌‌‌ఎఫ్ కింద సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు చేసినా.. పేదల అవసరాలకు ఇది ఇంకా సరిపోదని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం తెలిపారు. అందుకే రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాల కోసం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించి, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తామని చెప్పారు. ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం ఒక ధీమాగా నిలబడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యంత శాస్త్రీయంగా ఈ బీమా పథకాన్ని రూపొందించామని సీఎం రేవంత్ తెలిపారు. గత పాలకుల వలె కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో పాటు ఈ కొత్త బీమా పథకం రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గతంలో అవినీతి, అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరు పీఏలు, ఆఫీసు సిబ్బంది పేదల పేరుతో చెక్కులు తీసుకుని ప్రైవేట్ ఖాతాల్లో వేసుకున్నారని, దీనిపై విచారణ సాగుతోందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్‌‌‌‌ఎఫ్ ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి, ఎమ్మెల్యేలకు ఆన్‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌సైట్ ద్వారా పారదర్శకత కల్పించామన్నారు. నేరుగా వెబ్‌‌‌‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండటంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు లబ్ధి చేకూరుతోందని సీఎం వివరించారు.  

ఆరోగ్యశ్రీ కేసులు ప్రభుత్వ బోధనా ఆస్పత్రులకువైద్య విద్యను, వైద్య సేవలను అనుసంధానం చేస్తూ ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో  మార్పులు తీసుకురానున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. టీచింగ్ కాలేజీలకు పేషెంట్లు రావడం లేదని, అదే సమయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నిధులు వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు క్లినికల్ అనుభవం పెరగడం కోసం ఆరోగ్యశ్రీ కేసులను ప్రభుత్వ బోధనా ఆస్పత్రులకే దారి మళ్లిస్తామన్నారు. సర్జరీలు చేసే ప్రభుత్వ డాక్టర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని, తద్వారా వారు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్లకుండా చూస్తామన్నారు. ఆస్పత్రి నిర్వహణలో డాక్టర్లపై ఉన్న అదనపు భారాన్ని తగ్గించేందుకు అడ్మినిస్ట్రేషన్ వింగ్‌‌‌‌ను వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. డాక్టర్లు కేవలం రోగులకు చికిత్స అందించడంపైనే దృష్టి సారించేలా, ఆస్పత్రి పారిశుధ్యం, పార్కింగ్ వంటి పనులను గ్రూప్-1 స్థాయి అధికారులకు అప్పగిస్తామన్నారు. సూపరింటెండెంట్​ కేవలం మెడికల్ అంశాలకే పరిమితమైతే వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని, పాలనా పరమైన లోపాలు తలెత్తకుండా ఉంటాయని వివరించారు. మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌‌‌‌ఎఫ్ నిధులు నేరుగా వెళ్లడం వల్ల ఆయా ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడి కార్పొరేట్ స్థాయికి చేరుతాయని చెప్పారు. డాక్టర్లు, నర్సుల హాజరు నుంచి క్యాంటీన్ సౌకర్యాల వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికార యంత్రాంగం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వ వైద్య రంగంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తామని సీఎం పేర్కొన్నారు.  

ఎన్నారై డాక్టర్ల కోసం ప్రత్యేక వెబ్‌‌‌‌సైట్

విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డల వైద్య నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రజల కోసం వినియోగించుకునేందుకు ఒక ప్రత్యేక ప్లాట్‌‌‌‌ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. వేల సంఖ్యలో ఉన్న ఎన్నారై డాక్టర్లు తమ సొంత ప్రాంతానికి సేవ చేయాలని భావిస్తున్నారని, వారి కోసం వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను రూపొందిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చే డాక్టర్లు తమ పర్యటన సమయంలో ఏ తేదీల్లో, ఏ ఆస్పత్రుల్లో ఉచితంగా సేవలందిస్తారో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అత్యంత అధునాతన శస్త్రచికిత్సలు చేయడంలో నిపుణులైన ఈ డాక్టర్ల సేవలను మన మెడికల్ కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కూడా వాడుకుంటామన్నారు. 

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి.. 10 వేల అదనపు పడకలను అందుబాటులోకి తెస్తామన్నారు. వరంగల్, అల్వాల్, ఎల్‌‌‌‌బీ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రులను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో గోషామహల్‌‌‌‌లో 30 ఎకరాల స్థలంలో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు. సుమారు రూ.3 వేల కోట్ల వ్యయంతో 2 వేల పడకల సామర్థ్యంతో ఉస్మానియా నూతన హాస్పిటల్​ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం హెరిటేజ్ భవనాల పేరుతో వివాదాలు సృష్టించి కాలయాపన చేసినా, తాము ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తున్నామన్నారు. నిమ్స్ ఆస్పత్రి తరహాలోనే ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ముందస్తు ఎల్‌‌‌‌ఓసీ  సౌకర్యాన్ని కల్పించేలా కసరత్తు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడటం తగ్గించి, ప్రభుత్వ రంగంలోనే అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ఈ రంగంపై ఉన్న సంపూర్ణ అవగాహనను దృష్టిలో పెట్టుకునే తానే స్వయంగా ఈ శాఖను అప్పగించానన్నారు. సమాజంలో ఎప్పటికప్పుడు వచ్చే కొత్త రకమైన వ్యాధులను, సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతరం చదువుతూ, అప్రమత్తంగా ఉండే నేత ఈ శాఖకు అవసరమన్నారు.

విద్య, వైద్యంలో రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌‌‌‌ చేస్తం

తమ ప్రభుత్వం ప్రాధాన్యత కేవలం పేదల విద్య , వైద్యం మాత్రమేనని, ఈ రెండింటి విషయంలో బడ్జెట్ కోతలు ఉండబోవని సీఎం స్పష్టం చేశారు. గతంలో కేవలం ఆకలి తీరితే సరిపోయేదని.. కానీ, నేడు ప్రజలకు పౌష్టికాహారం (న్యూట్రిషన్ ఫుడ్) అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో కూడా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ , స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు ఒక గొలుసుకట్టు విధానంలో వైద్య సేవలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సభ్యులు ఇచ్చిన విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను ఆపమని, అవసరమైతే ఇతర శాఖల్లో నిధులు తగ్గిస్తాం కానీ వైద్యానికి రూపాయి తక్కువ చేయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని  ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల భవిష్యత్తులో ప్రతి పేదవాడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు.