కృష్ణా, గోదావరిలో మన వాటా మనకు దక్కాల్సిందే!

కృష్ణా, గోదావరిలో మన వాటా మనకు దక్కాల్సిందే!
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలతో ముందే మాట్లాడండి: సీఎం రేవంత్‌‌‌‌
  • మహారాష్ట్రకు కరెంట్ ఇద్దాం.. కోయనా డ్యామ్ నీళ్లు మనం తీసుకుందాం 
  • సీలేరు, తుంగభద్ర విద్యుత్‌‌‌‌లో మన వాటాపై 
  • రిపోర్ట్ ఇవ్వండి.. ఆరుతడి పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి
  • రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకూడదు
  • హైదరాబాద్ రోడ్లపై వరద నీరు నిలవడానికి వీల్లేదు 
  • విపత్తు నిర్వహణకు  అందుబాటులో ఉన్న రూ.వెయ్యి కోట్లు వాడుకోవాలి 
  • డ్యామ్‌‌‌‌ల గేట్లకు వెంటనే రిపేర్లు చేయండి.. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు 
  • కలెక్టర్లు, ఎస్పీలు కలిసి పనిచేస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచన

హైదరాబాద్​, వెలుగు: ఈసారి ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నందున కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా జలాలను పక్కాగా సాధించుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎగువన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తమ డ్యామ్‌‌‌‌లు నిండిన తర్వాతే నీటిని కిందకు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయా రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున అంతర్రాష్ట్ర జలాలను ప్రొరేటా ప్రకారం డ్యామ్‌‌‌‌ల వారీగా విడుదల చేసేలా, ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలి’’ అని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని సెక్రటేరియెట్‌‌‌‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో వర్షాకాల సన్నద్ధతపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

పంటల మార్పిడి, ముఖ్యంగా తక్కువ నీటిని వినియోగించుకునే పంటల సాగువైపు రైతులను మళ్లించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పంటల మార్పిడి విషయంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని, టీవీ చానెళ్లలోనూ ఇందుకు సంబంధించిన ప్రసారాలు జరిగేలా చూడాలన్నారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని సీఎం తెలిపారు. వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు, కొత్త వంతెనల నిర్మాణం, ఇతర పనులకు విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.వెయ్యి కోట్లలో నుంచి నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు.

పవర్‌కు బదులు నీరు.. సీలేరు, తుంగభద్రలపై నివేదిక

మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని ఆ రాష్ట్రం వంద శాతం జలవిద్యుత్ ఉత్పత్తికే వాడుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని, వారికి అవసరమైన విద్యుత్‌ను  సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు జరపాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, కానీ ఆ వరదంతా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితవైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. వీటితోపాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై స్పష్టమైన నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

పాత హామీలపై రిపోర్ట్.. విపత్తుల్లో తక్షణ సాయం

గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తాను క్షేత్ర స్థాయిలో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై అధికారులను సీఎం ప్రశ్నించారు. నాడు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి, ఏవైనా నెరవేరకుంటే అందుకు గల కారణాలతో కూడిన నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు. హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు తక్షణమే స్పందించాలని, వడగాడ్పులు, వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయినప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి.. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. 

డ్యామ్‌ల గేట్ల  రిపేర్లకు రూ.300 కోట్లు విడుదల.. 

డ్యామ్‌ల మెయింటెనెన్స్‌పై  అధికారులను ఆరా తీసిన సీఎం.. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. గేట్ల  రిపేర్లు, మెయింటెనెన్స్‌లకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు తెలియజేయగా, పనుల కోసం ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్..  

క్యూర్  పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే 11 వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలుపగా, ఆ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీనియర్ ఐఏఎస్​అధికారి జయేశ్ రంజన్‌ను  సీఎం ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలో సమస్యల పరిష్కారానికి ముగ్గురు కమిషనర్లు, మూడు నగరాల పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
 తాగునీటి ఇబ్బందులు రావొద్దు..  
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు సీఎంకు తెలియజేయగా, పరిస్థితికి తగినట్టు తాగునీరు, విద్యుదుత్పత్తి, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి అవసరమైన సామగ్రిని ముందుగానే సమీకరించుకోవాలని, గాలిదుమారాలు, భారీ వర్షాలతో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు, లైన్లు తెగిపోయి సరఫరా నిలిచినప్పుడు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు.

 కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా భేటీ కావాలి

జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా సమావేశమవుతూ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి  సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో ముందుకు సాగితే ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్ర స్థాయితోపాటు జిల్లా, మండల స్థాయిలోనూ రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారుల మధ్య కోఆర్డినేషన్‌ ఉండాలన్నారు.  ఈ సమీక్షలో సీఎం సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్, దాన కిశోర్, టి.కె.శ్రీదేవి, ఏ.వి.రంగనాథ్, నవీన్ మిట్టల్, సురేంద్ర మోహన్, క్రిస్టినా చోంగ్తూతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.