V6 News

Telangana Global Summit : 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Global Summit : 2047 నాటికి   పేదరికం లేని రాష్ట్రం: సీఎం రేవంత్ రెడ్డి
  • అదే లక్ష్యంతో మెగా మాస్టర్​ ప్లాన్​: సీఎం రేవంత్‌
  • కుల వివక్ష పోవాలంటే.. ‘వేర్వేరు’ హాస్టళ్లు రద్దు కావాల్సిందే
  • అందుకే  ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’
  • ఆనంద్‌ మహీంద్రా సారథ్యంలో స్కిల్స్‌ వర్సిటీ
  • ఒలింపిక్స్‌ టార్గెట్‌గా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు
  • నెహ్రూ స్ఫూర్తితో సాగు, విద్యపై ఫోకస్‌ పెట్టినట్టు వెల్లడి
  • ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ డాక్యుమెంట్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి పేదరికం లేని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే విజన్​ డాక్యుమెంట్‌‌ను రూపొందించుకున్నట్టు చెప్పారు. మంగళవారం భారత్​ ఫ్యూచర్​ సిటీలో నిర్వహించిన గ్లోబల్​ సమిట్‌‌లో ‘తెలంగాణ రైజింగ్​–2047 విజన్’​ డాక్యుమెంట్‌‌ను సీఎం రేవంత్‌‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పేదరికం నాకు పర్యాటకం కాదు. అది నా ప్రత్యక్ష అనుభవం. కొందరు నేతలు బెంజ్‌‌ కార్లలో వెళ్లి పేదలను పలకరించి, పేదరికాన్ని ఒక ‘ఎక్స్‌‌కర్షన్‌‌’లా చూస్తుంటారు.. నేను అలా కాదు.. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి, కుల వివక్షను, అంటరానితనాన్ని స్వయంగా చూసిన వాడిని. అందుకే 2047 నాటికి పేదరికం లేని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా ఈ ‘మెగా మాస్టర్ ప్లాన్’ను రూపొందించాం” అని పేర్కొన్నారు. 1947లో భారతీయుల సగటు జీవితకాలం 32 ఏండ్లు కాగా.. ఇప్పుడు 73 ఏండ్లకు చేరిందని.. మనం 100 ఏండ్ల జీవితకాలం  సాధించే దిశగా ఆరోగ్య విధానాలు రూపొందించుకోవాలని అన్నారు. 

కులాలవారీ హాస్టళ్లు వద్దు..  

రాష్ట్రంలో పిల్లలకు కులాలవారీగా హాస్టల్‌‌‌‌లు ఉండొద్దనే ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ‘‘సమాజంలో కుల వివక్ష పోవాలని కోరుకుంటాం.. కానీ ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు హాస్టళ్లు కట్టి కులాలను విడదీస్తున్నది. నిధులిచ్చి మరీ అడ్డుగోడలను కడుతున్నది. నేను సీఎం కాగానే ఈ పద్ధతి పోవాలని చెప్పా. అందుకే కులాలకతీతంగా అందరూ ఒకే ప్రాంగణంలో చదువుకునేలా 100 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను మంజూరు చేశా. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాలు, రూ.200 కోట్లు కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో కడుతున్నాం. ఇవి దేశానికే రోల్ మోడల్ అవుతాయి” అని తెలిపారు.  

సంక్షేమంపై పెట్టేది ఖర్చు కాదు..భవిష్యత్తుకు​ పెట్టుబడి

పేదల కోసం చేసే ఖర్చును కొందరు ఉచితాలుగా చూస్తున్నారని,  కానీ విద్య, ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తన దృష్టిలో వ్యయం కాదని సీఎం రేవంత్‌‌‌‌ అన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తుపై పెడుతున్న పెట్టుబడి అని,  సమాన అవకాశాలు వచ్చే వరకు పేదలకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అందుకే 4 లక్షల మంది ప్రజల నుంచి సలహాలు స్వీకరించి, రైతులు, మహిళలు, యువత కేంద్రంగా ఈ పాలసీని రూపొందించామన్నారు. 

నైపుణ్యాభివృద్ధికే స్కిల్స్​యూనివర్సిటీ..

సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినా.. ప్రస్తుత చదువుల్లో క్వాలిటీ, స్కిల్స్ లేవని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు.  అందుకే ఆనంద్ మహీంద్రా చైర్మన్‌‌‌‌గా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే, 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌‌‌‌లో స్వర్ణ పతకాలు రాకపోవడం విచారకరమని, అందుకే ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని స్థాపిస్తున్నామని చెప్పారు. 

గాంధీ, నెహ్రూలే స్ఫూర్తి

ఏ నిర్ణయం తీసుకున్నా.. అది నిస్సహాయుడైన నిరుపేదకు మేలు చేసేలా ఉండాలన్న మహాత్మా గాంధీ సూత్రమే తమ విజన్‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌కు పునాది అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు.  దేశ తొలి ప్రధాని నెహ్రూ విద్య, సాగునీటి (ఇరిగేషన్) ప్రాధాన్యతను గుర్తించి ఐఐటీలు, యూనివర్సిటీలు, భాక్రానంగల్, నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌లాంటి ప్రాజెక్టులు కట్టించారన్నారు. ఆయన బాటలోనే తమ ప్రభుత్వం కూడా విద్య, సాగునీరు, కమ్యూనికేషన్ (రోడ్లు, డిజిటల్, ఎయిర్ పోర్ట్స్) పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నదని చెప్పారు.  సోనియా గాంధీ, మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ మన ఆకాంక్షలను నెరవేర్చి తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ప్రధాని మోదీ 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (వికసిత్ భారత్) మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో తెలంగాణ వాటా 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండాలని నిర్ణయించినట్టు చెప్పారు.  దేశ జనాభాలో మనం 2.9 శాతమే ఉన్నా.. జీడీపీకి 5 శాతం అందిస్తున్నామని, భవిష్యత్తులో దేశ జీడీపీలో మన వాటా 10 శాతానికి చేరాలని అన్నారు. ఇందుకోసం చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలను రోల్ మోడల్స్‌‌‌‌గా తీసుకొని, వాటితోనే పోటీ పడతామని తెలిపారు.

నా నేపథ్యమే నా బలం..

తన నేపథ్యమే తనకు బలం అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ‘‘ జల్, జంగిల్, జమీన్’’ నినాదంతో కొమురం భీమ్‌‌‌‌ పోరాడారు. సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం కొట్లాడారు. ఆ పోరాట స్ఫూర్తి ఈ నేలలో ఉంది. నేను ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, సామాన్య రైతు బిడ్డగా జడ్పీటీసీ నుంచి 17 ఏండ్ల ప్రయాణంలో సీఎంను అయ్యా. ప్రభుత్వ బడిలో, తెలుగు మీడియంలో చదివా. 11 ఏండ్లప్పుడు ప్రమాదం జరిగితే నిజాం కట్టిన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. నాకు పేదరికం, వైద్యం విలువ, నిరుద్యోగ యువత బాధ తెలుసు. అందుకే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ ప్రణాళిక రచించా’’ అని వ్యాఖ్యానించారు.  

సీఎం విజన్‌కు ఫిదా అయ్యా 

ఈ విజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయా. నేను చూసిన అత్యంత ఆశావహమైన, ప్రజా కేంద్రంగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్లలో ఇదొకటి. దీని గొప్పతనం కేవలం దాని లక్ష్యాల్లోనే కాదు.. దాని పునాదిలోనూ ఉంది. ఇది ఎవరో నలుగురు రాసింది కాదు.. ప్రజలతో, నిపుణులతో చర్చించి.. వారి ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా రూపొందించారు. సీఎం రేవంత్​ విజన్​కు ఫిదా అయ్యాను. 
- ఆనంద్ మహీంద్రా, పారిశ్రామికవేత్త

ఈ స్కీమ్స్​ ‘లైఫ్ లైన్స్’ 

రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లలో చేపట్టిన సంస్కరణలు, పథకాలు అద్భుతం. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ స్కీమ్స్​ ‘లైఫ్ లైన్స్’. యువతకు ఏఐ, డిజిటల్ లిటరసీలో నైపుణ్యాలు పెంచేందుకు అడోబ్ తరఫున ప్రభుత్వంతో కలిసి పనిచేస్తం. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల  ఎకానమీగా తీర్చిదిద్దడం సాధ్యమే.
- శంతను నారాయణ్,
‘అడోబ్’ సీఈవో

తెలంగాణ అన్​బీటబుల్​..

తెలంగాణ అన్‌స్టాపబుల్ అని సీఎం అన్నారు.. కానీ తెలంగాణ అన్‌బీటబుల్. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరుకోవాలంటే ఏటా 8- 9%  వృద్ధి సాధించాలి. వచ్చే పదేండ్లలో తెలంగాణ ప్రపంచ దేశాలకే మోడల్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు తెలంగాణ అంటే పేదరికం.. ఇప్పుడు అభివృద్ధి. 
- దువ్వూరి సుబ్బారావు,
ఆర్బీఐ మాజీ గవర్నర్