
- దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి
- శ్రద్ధ తీసుకుంటరనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్‌కు పంపుతున్నరు
- స్కిల్స్ లేకనే యువతకు జాబ్స్ దక్కట్లే.. విద్యారంగంలో సర్కార్ పాత్ర తగ్గిపోతున్నది
- దీనికి 21 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, అందులో 98% జీతాలకే ఖర్చవుతున్నది
- కొత్త విద్యావిధానం అమలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం
- ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
- ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా మార్చా ల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూములు, నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఆ వనరులు లేవు. దీంతో పేదరిక నిర్మూలనకు విద్య తప్ప.. మరో ఆయుధం లేదు. అందుకే విద్యా రంగానికి మేం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే ఇప్పటి వరకు విద్యారంగాభివృద్ధికి చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందడం లేదు.
ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై బుధవారం సెక్రటేరియెట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ సభ్యులు, విద్యావేత్తలు, నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ దేశానికే దిక్సూచిలా ఉండాలన్నారు.
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో మన విద్యావిధానం ఉండాలని సూచించారు. ‘‘వచ్చే 25 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ విద్యావిధానం ఉండాలి. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో దీనికి చోటు కల్పిస్తాం. ఈ డాక్యుమెంట్ రూపొందించడానికి విద్యావేత్తలు.. ప్రైమరీ, హయ్యర్, టెక్నికల్, స్కిల్ ఎడ్యుకేషన్ తదితర సబ్- కమిటీలుగా ఏర్పడి అత్యుత్త మ నివేదికను తయారు చేయాలి. ఈ విద్యా విధానం కేవలం వ్యక్తులు లేదా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలి” అని దిశానిర్దేశం చేశారు.
అందరికీ ఒకేచోట విద్య..
దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినా, విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో.. వాటిని అందిపుచ్చుకోవడంలో మన యువత విఫ లమవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా రావడంతో పెద్ద సంఖ్యలో యువత సాఫ్ట్ వేర్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. కానీ వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు.
దీనికి నైపుణ్యాల లోపమే ప్రధాన కారణం. ఈ సమస్యను అధిగమించడానికి విద్యా రంగంలో సమూల ప్రక్షాళన అవసరం” అని అన్నారు. విద్యారంగంలో సర్కార్ పాత్ర తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే, అందులో 98 శాతం జీతాలకే ఖర్చవుతున్నదని చెప్పారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరుతో విద్యార్థులను వేరు చేయకుండా.. అందరినీ ఒకేచోట చదివించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా విద్యావిధానం రూపొందించాలి.
దీని అమలుకు స్వచ్ఛంద సంస్థలు, ఫౌండేషన్ల సహకారం తీసుకోవాలి. కొత్త విద్యావిధానం కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సర్కార్ సిద్ధంగా ఉంది. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం. విద్యపై చేసే ఖర్చును వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం” అని చెప్పారు. సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.
సర్కార్ బడుల్లో స్టూడెంట్లు తగ్గుతున్నరు..
విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా, సర్కార్ బడుల్లో స్టూడెంట్లు తగ్గుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేట్ స్కూళ్లు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి క్లాసులు ప్రారంభిస్తుంటే.. సర్కార్ బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే ప్రారంభిస్తున్నాం. నర్సరికీ ప్రైవేటు బడుల్లో చేరినవాళ్లు.. మళ్లీ సర్కార్ స్కూళ్ల వైపు చూడటం లేదు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పిస్తున్నారు.
సర్కార్ స్కూళ్లు కూడా ఆ రకమైన ధీమా కల్పించగలిగితే.. పేరెంట్స్ తమ పిల్లలను గవర్నమెంట్ బడుల్లోనే చేర్పిస్తారు. ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనలో ఈ అంశాలను దృష్టిలో పెట్టు కోవాలి” అని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు ఉండాలనే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే ఖాళీ పోస్టులను భర్తీ చేసినట్టు గుర్తు చేశారు. టీచర్లు బోధనపై దృష్టిపెట్టేలా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వర్సిటీలకు వీసీలను నియమించామన్నారు.
ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు గతంలో సైద్ధాంతిక భావజాలాలకు నిలయంగా నిలిచి, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేవని గుర్తుచేశారు. స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ వరకూ విద్యా ప్రమాణాలు పడిపోయాయని, నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించక విద్యార్థులు డ్రగ్స్ బారినపడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్ ఇంజిన్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులే ఇప్పటికీ ఉన్నాయి.
మేం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించాం. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేశాం” అని తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావు, రంజీవ్ ఆచార్య, ఐఐటీ హైదరాబాద్ డైరె క్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, శాంతాసిన్హా, సీఎస్ కె.రామకృష్ణారావు, ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, ఏవీఎన్‌రెడ్డి, టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలి: కేకే
విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. ఏఐ వంటివి ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కాలేవన్నారు.