సీఈసీ రాజీనామా చేసే దాకా పోరాటం..సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

సీఈసీ రాజీనామా చేసే దాకా పోరాటం..సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా మారిన సర్‌‌ను తక్షణమే రద్దు చేయాలని, ఈ తప్పిదాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బీజేపీ ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన 'ఓటు బచావో.. దేశ్ బచావో' ఆందోళనపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌, ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 

సీఈసీ రిజైన్​ చేయాలి: మంత్రి వివేక్​

చీఫ్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌ రాజీనామా చేయాలని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలంటే ఆయనను పదవి నుంచి తొలగించాలన్నారు. మంగళవారం మందమర్రిలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్‌‌ ప్రక్రియలో అవకతవకలకు జ్ఞానేశ్‌‌ కుమారే కారణమని ఆరోపించారు.

బీజేపీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆరోపించారు. బీజేపీ సీఈసీ, ఈడీ, సీబీఐలను రాజకీయంగా వాడుకుంటోందన్నారు. ఓట్‌‌ చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌‌గాంధీ రెండేళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాక్‌‌ల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.

కొత్త గనులు దక్కితే బొగ్గు ఉత్పత్తిని 70 నుంచి 100 మిలియన్‌‌ టన్నులకు పెంచవచ్చన్నారు.  మందమర్రి మున్సిపాలిటీలో రూ.36 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, అమృత్‌‌ స్కీం కింద రూ.30 కోట్లతో చేపట్టిన తాగునీటి పనులు జనవరిలోపు పూర్తవుతాయని తెలిపారు. సింగరేణి నుంచి 30 ఎకరాల భూమిని తీసుకుని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్‌‌ రఘునాథ్‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌ నేత జగన్‌‌మోహన్‌‌రావు, ఏసీపీ కిరణ్‌‌కుమార్‌‌, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ తుంగపిండి రాజలింగు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను ఖండించిన మంత్రులు

రాహుల్‌‌, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అక్రమ అరెస్టులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అరెస్ట్​లు, తప్పుడు కేసులతో అణచివేయలేరన్నారు. అక్రమ నిర్బంధాలు కాంగ్రెస్, ఇండియా కూటమి పోరాట పటిమను ఏమాత్రం తగ్గించలేవని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అక్రమ అరెస్టులు దోహదపడతాయని నేతలు హెచ్చరించారు.