
- ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కావాలనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు
- రేవంత్‌రెడ్డికి సీఎంగా అనుభవం లేదు
- ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు.. హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ పట్టలేదు
- నాపై అడ్డమైన మాటలు మాట్లాడితే సీఎం అయినా తాట తీస్త
- దానం, కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్‌కు టైమ్ ఇస్తున్నం
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్‌కు బదులు వాటర్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు తాగు నీరు, సాగు నీరు కోసం తండ్లాడుతున్నారని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో సాగునీరు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ తనకేం పట్టలేదని వ్యాఖ్యానించారు. ‘‘లీకు వీరుడు రేవంత్‌రెడ్డి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు బలంగా ప్రయత్నిస్తున్నడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించినట్లు ఓ మంత్రి అంటది. ఆమెకు అసలు నెత్తి ఉందో లేదో నాకు తెల్వది. నాకంత ఖర్మ ఏంది? నాకు ఆ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? నాకెలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేదు.
ఈ అడ్డమైన మాటలు, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే.. వారు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తాట తీస్తం. లీగల్‌గా చూసుకుంటం” అని కేటీఆర్ అన్నారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ లు ఎప్పుడెప్పుడు జరిగాయో కూడా రేవంత్‌రెడ్డి ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2022, 2023లో తన ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ కంపెనీ తనను అలర్ట్ చేసిందని, ఆ విషయాన్ని తాను అప్పుడే స్క్రీన్ షాట్లతో ట్విటర్‌లో పోస్ట్ చేశానని కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటి వాళ్ల ఫోన్లకు హ్యాకింగ్ అలర్టులు వచ్చాయని అన్నారు.
కాంగ్రెస్‌కు నీటి నిర్వహణ రావడం లేదు
కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని తాము గతంలోనే చెప్పామని, ఇప్పుడు అదే జరుగుతున్నదని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు గాయత్రి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పారు. ఇన్నాళ్లూ లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు నీటి నిర్వహణ రావడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన అనుభవం లేదని, నేర్చుకోవాలన్న జిజ్ఞాస కూడా లేదని విమర్శించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, ట్యాంకర్లు బుక్ చేసిన 12 గంటల్లోపే పంపిస్తున్నామంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
దమ్ముంటే రూ.2 లక్షల రుణమాఫీ చెయ్
రేవంత్ పార్టీ గేట్లు ఎత్తడం మీద పెట్టిన శ్రద్ధ, ప్రాజెక్ట్ గేట్ల మీద పెట్టడం లేదని కేటీఆర్ విమర్శించారు. దమ్ముంటే 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాలని రేవంత్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 218 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని, వివరాలను అందజేస్తామని, ఒక్కో కుటుంబానికి25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెల్లని నోటు కేసీఆర్ కాదు.. రాహుల్ గాంధీ అని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు మాత్రమే వస్తాయని మమతా బెనర్జీనే చెప్తున్నారని అన్నారు.
స్పీకర్‌కు సండే వరకూ టైమ్ ఇస్తున్నం
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తప్పకుండా అనర్హత వేటు పడుతుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే వీరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, తమ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు ఆదివారం వరకు టైమ్ ఇస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కొండా, యెన్నం, కేకేకు నోటీసులు
తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వేర్వేరుగా లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే సివిల్, క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక తాను ఉన్నట్టుగా, ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లను బెదిరించినట్టు కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఇందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనపై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డి.. తప్పుడు ఆరోపణల ద్వారా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన నిరాధార ఫిర్యాదును వెనక్కి తీసుకుని సారీ చెప్పాలని మహేందర్ రెడ్డిని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డితో పాటు యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన కూడా క్షమాపణ చెప్పాలన్నారు.