- రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలూ తీసుకుంటున్నం
- గత పాలనలో ఇలాంటి పరిస్థితే లేదు.. సెక్రటేరియెట్‌కు వెళ్తే నన్నూ నిర్బంధించారు
- నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనిచ్చేవాళ్లే కాదు
- మేం అందరికీ అవకాశమిస్తున్నం
- పదేండ్లు కేసీఆర్ దోచుకున్నడు.. ఆయన ఇంట్లో ఇప్పుడంతా పైసల పంచాదే
- ప్రాణహిత ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లిస్తం
- ఏడాదిలో ఎయిర్ పోర్ట్ పనులు షురూ
- త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన
- ఆదిలాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగం
- నేను ఏం అడిగినా స్పందిస్తున్నరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దని.. వీలైనంతగా ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘ఎక్కువగా ఖర్చులు పెట్టి.. డబ్బులు వృథా చేసుకోవద్దు. మళ్లీ ఆ డబ్బు తిరిగిరాదు. ఏకగ్రీవాల కోసం ప్రయత్నించండి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులిస్తుంది” అని తెలిపారు. మంచోళ్లను, అభివృద్ధి చేసెటోళ్లనే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ‘‘పదేండ్ల అరాచక పాలనను ప్రజలు అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలా భావించి మేం ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నామని.. గత పాలనలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనిచ్చేవాళ్లే కాదని పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. రూ. 26.45 కోట్ల అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు.
ప్రజల గౌరవ, మర్యాదల కోసం తాము నిరంతరం పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ సభకు వచ్చిన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీకి చెందినవాళ్లే అయినప్పటికీ.. రాష్ట్రాభివృద్ధి కోసం వారితో కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు సీఎం సభల్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. సెక్రటేరియెట్‌కు వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తనను, సీతక్కను నిర్బంధించి ఇంటి గేటు కాడ పడేశారని ఆయన తెలిపారు. తాము మాత్రం అందరి సూచనలు తీసుకుంటున్నామని, వారితో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. రెండేండ్లలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. చిన్న వయసులోనే దేవుడి సంకల్పం, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఆహ్వానించానని.. సోనియమ్మ వల్లే తెలంగాణ సాకారమైందని, గ్లోబల్ సమిట్ వంటి గొప్ప కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కన్నతల్లిలాంటి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని కూడా కలిసి రాష్ట్రానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
ఏడాదిలో ఆదిలాబాద్ఎయిర్ పోర్టు పనులు షురూ
ఏడాదిలోనే ఆదిలాబాద్ లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘‘ఎయిర్‌పోర్టు కోసం భూమి ఇస్తే కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహకరిస్తామని చెప్పారు.. ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.. అందుకే భూ సేకరణకు జీవో ఇచ్చాం. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ కు ఎయిర్ బస్సు కూడా తీసుకొస్తాం” అని తెలిపారు. అపార సున్నపురాయి వనరులున్న సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడిందని.. ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఫ్యాక్టరీ తెరిపించడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి దండోరతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశామని, తాము అధికారంలోకి వచ్చాక మొదటి సంతకంతో ఇంద్రవెల్లి స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించామని, ఆ నాటి అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు.
ప్రాణహిత పూర్తిచేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లిస్తం
ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణమిత –చేవెళ్ల ప్రాజెక్టు కట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అంచనాలు రూపొందిస్తామని, ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ కు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 లక్షల ఎకరాల కు నీళ్లు ఇవ్వడం కోసం శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టుకు ఆనాడు కాకా వెంకటస్వామి చెప్పినట్లు అంబేద్కర్ పేరు పెట్టారని పేర్కొన్నారు. ‘‘కానీ ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. పేరు, ఊరు , అంచనాలు మార్చడంతో లక్షల కోట్ల రూపాయలు గోదావరి పాలైంది. కాళేశ్వరం మూడేండ్లలోనే కూలిపోయింది. ఆయన ఇంట్లో కనకవర్షం కురిసిందే తప్ప.. ఆదిలాబాద్‌కు చుక్క నీరు రాలేదు” అని కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి దగ్గర 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ఒప్పుకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల తుమ్మిడిహెట్టి వద్ద ఉండాల్సిన ప్రాజెక్టు కరీంనగర్ కు మారిందన్నారు. ‘‘అక్రమ సొమ్ము రావడంతో సొంత బిడ్డలు, కుటుంబ సభ్యులే కత్తులతో పొడ్చుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు ఓ దిక్కు.. అసలాయిన ఎక్కడ పడుకున్నాడో అందరికీ తెలుసు” అటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసల పంచాయితీ తప్ప వాళ్ల ఇంట్లో ఇంకో పంచాయతీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. ఇక్కడి బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యేకు ఢిల్లీలో బాగానే పరపతి ఉందని. ఈ ప్రాజెక్టు కోసం వారు అక్కడి పెద్దలను ఒప్పించాలని ఆయన అన్నారు.
వరి వేస్తే ఉరే అన్నడు
ఆడబిడ్డలను గత సీఎం దివాలా తీయించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాము రూ. 8,100 కోట్లను ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేటాయించామని, వెయ్యి బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేశామని తెలిపారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడిపంటలు సంవృద్ధిగా ఉంటాయన్నారు. వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ చెప్పారని.. తాము మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. 3.10 కోట్ల మంది సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని చెప్పారు. కొరాటా చనాకా ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గోడం నగేశ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికికృషి చేస్తున్నాం: మంత్రి జూపల్లి
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేద విద్యార్థులు కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ – 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి దూర దృష్టితో ప్రణాళిక రూపొందించామన్నారు.
పేదల ఇంటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్: మంత్రి వివేక్
పేదల ఇంటి కలను ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ నెరవేరుస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం, ఇసుక, భూ మాఫీయాతోపాటు అన్ని పథకాల్లో అవినీతిలో కూరుకుపోయింది. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని సాగనంపి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. గ్యారంటీ కార్డులోని పథకాలు అమలు చేస్తున్నాం. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటు కోసం, యువతకు ఉద్యోగాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి అనేక కంపెనీలతో మాట్లాడారు. వాటిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. 115 ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసి 2 లక్షల నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం” అని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచిందని.. ప్రజలకు మరో అవకాశం వచ్చిందని.. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తమపై ఉందని.. ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బెటర్ అని తన మనసుకు అనిపిస్తున్నదని.. దానికి కొమురంభీం అని పెట్టుకుంటే బాగుటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అది తన సూచన మాత్రమేనని.. ఇక్కడి నేతలు సమన్వయం చేసుకొని యూనివర్సిటీ ఎక్కడపెడితే బాగుంటుందో చెప్పాలని ఆయన కోరారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ.. వాళ్ల (కేసీఆర్) ఇంట్లో మాత్రమే వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలోనే 61 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని.. త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలని నిరుద్యోగులను సూచించారు. రాష్ట్ర యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలన్నది తన కోరిక అని తెలిపారు.
సీఎం రేవంత్ గొప్ప మనసు
ఆదిలాబాద్, వెలుగు: అభివృద్ధిలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రేవంత్ ఎంతో కష్టపడుతున్నారని, ఆయనది ఎంతో గొప్ప మనసు అని పొగడ్తలతో ముంచెత్తా రు. ఏది అడిగినా వెంటనే స్పందిస్తున్నారని కొనియాడారు. ప్రజాపాలన విజయోత్సవ సభ వేదికపై సీఎం రేవంత్ వచ్చిన వెంటనే పాయల్ శంకర్ ప్రసంగం ప్రారంభించారు. ‘‘అడిగిన వెంటనే ఆదిలాబాద్‌కు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారు. వందల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల గొప్ప మనసుతో ఉన్న రేవంత్‌ను పదే పదే కలుస్తా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను నా నియోజకవర్గానికి అడిగినవి సాధ్యమైనంత వరకు సీఎం మంజూరు చేస్తున్నారు. 700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భూ సేకరణ జీవో జారీ చేసిన సీఎంకు ధన్యవాదాలు చెప్తున్న’’అని శంకర్ అన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు కోసం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా సానుకూలంగా స్పందించారని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. భూసేకరణ జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
