ఇవాళ రాష్ట్రానికి సీఎం రాక.. సక్సెస్​ఫుల్​గా ముగిసిన అమెరికా, సౌత్ కొరియా పర్యటన

ఇవాళ రాష్ట్రానికి సీఎం రాక.. సక్సెస్​ఫుల్​గా ముగిసిన అమెరికా, సౌత్ కొరియా పర్యటన

హైదరాబాద్, వెలుగు: పదకొండు రోజుల అమెరికా, సౌత్ కొరియా పర్యటనను సక్సెస్ ఫుల్​గా ముగించుకుని సీఎం రేవంత్​రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్​చేరుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ‘ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ’ నినాదంతో సీఎం రేవంత్ తన టూర్ కొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. 

పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, స్పెషల్​ సీఎస్​ కూడా ఈ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ అమెరికా టూర్​లో రూ.31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్​లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మరికొన్ని  కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. 

ఈ ఒప్పందాలతో దాదాపు 30 వేల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 50కి పైగా మీటింగ్స్.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధుల బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్​లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. 

ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌‌, జొయిటిస్, హెచ్ సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో తమ సెంటర్లు నెలకొల్పేందుకు రాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. 

డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయం తీసుకున్నది. ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇక సౌత్ కొరియాలోనూ పర్యటించి.. టెక్స్​టైల్ ఫెడరేషన్, హ్యుందాయ్, ఎల్ఎస్​కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.