ఇయ్యాల ( ఫిబ్రవరి 18 ) ముంబై క్లైమేట్ వీక్-2026 సదస్సుకు సీఎం

ఇయ్యాల ( ఫిబ్రవరి 18 ) ముంబై క్లైమేట్ వీక్-2026 సదస్సుకు సీఎం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను, హైదరాబాద్ మహానగరం సాధిస్తున్న విస్తృత ప్రగతిని మరో అంతర్జాతీయ వేదికపై  సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇందుకోసం ముంబై వేదికగా మంగళవారం ప్రారంభై మూడు రోజులు జరగనున్న ‘ముంబై క్లైమెట్ వీక్-2026’ సదస్సులో పాల్గొనేందుకు సీఎం మంగళవారం శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. బుధవారం జరిగే సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు, పరిపాలనా పరమైన సంస్కరణలు, హైదరాబాద్‌‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను సీఎం ఈ వేదిక ద్వారా వివరించనున్నారు. 

బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌‌లోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ సదస్సు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న ఈ క్లైమెట్ వీక్‌‌లో దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇక సీఎం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. తిరిగి 20వ తేదీన మళ్లీ హైదరాబాద్​కు రానున్నారు.