సొంతూర్లో సీఎం దసరా సంబురాలు..ఇవాళ (అక్టోబర్ 20)మధ్యాహ్నం కొండారెడ్డిపల్లికి రేవంత్

సొంతూర్లో సీఎం దసరా సంబురాలు..ఇవాళ (అక్టోబర్ 20)మధ్యాహ్నం కొండారెడ్డిపల్లికి రేవంత్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో దసరా సంబురాలు జరుపుకోనున్నారు. మంగళ వారం మధ్యాహ్నం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంటారు.మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం కొండారెడ్డిపల్లిలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.  మధ్యాహ్నం 2 గంటలకు గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో  భేటీ కానున్నారు.  అనంతరం సాయంత్రం కొండారెడ్డిపల్లి గ్రామంలో సంప్రదాయబద్ధంగా జరిగే దసరా జమ్మి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 

ఊరి పెద్దలు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలందరితో కలిసి జమ్మి చెట్టు వద్ద నిర్వహించే శాస్త్రోక్త పూజా క్రతువులో పాల్గొని, అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ‘అలయ్ బలయ్’ తీసుకోనున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాయి. స్వగ్రామంలో దసరా వేడుకలు, పూజా కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా ముగిసిన తర్వాత రాత్రి వేళ సీఎం  రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్‌‌కు చేరుకోనున్నారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు 

సీఎం రేవంత్‌‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఈ పండుగ ధైర్యం, ధర్మం, సత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. మనలోని అహంకారం, అసూయలను తొలగించుకుని, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జమ్మిచెట్టును పూజించి, ఆకులను బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకునే మన సంప్రదాయం ప్రకృతిని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని వివరించారు.