- హాజరుకానున్న సీఎం.. చంచల్‌గూడ కాలేజీలో సభ
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ వరకు రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవు,16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఇందులో భూసేకరణకు రూ.153.37 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, ఐఎస్‌సదన్, చంపాపేట్, కంచన్‌బాగ్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇది హైదరాబాద్లో మూడో అతిపెద్ద ఫ్లై ఓవర్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సుమారు ఆరేండ్లపాటు కొనసాగాయి. భూసేకరణ, కరోనా, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో పనులు అనుకున్న సమయంలో పూర్తికాలేదు.
సాయంత్రం 4 గంటలకు స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం చంచల్ గూడ జూనియర్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్లో మూడో అతి పెద్ద ఫ్లై ఓవర్హైదరాబాద్సిటీలో 2009లో పీవీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది. దీన్ని11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్లుగా నిర్మించారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్‌గా రికార్డును సొంతం చేసుకుంది. సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య లేకుండా దీన్ని నిర్మించారు. ఇక ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో రెండో స్థానంలో ఉంది. గతేడాది జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న సైదాబాద్ఫ్లై ఓవర్ నగరంలో మూడో అతిపెద్ద ఫ్లైఓవర్ కానుంది. 2.21 కిలోమీటర్ల పొడవుతో కొత్తగూడ ఫ్లై ఓవర్ నాలుగో స్థానంలోకి చేరింది.
