- క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా రాష్ట్రం.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలల సాకారం కోసం ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రాన్ని భౌగోళికంగా కాకుండా, అభివృద్ధి ప్రామాణికంగా మూడు విభిన్న జోన్లుగా (క్యూర్-, ప్యూర్,- రేర్) విభజించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుండటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రత్యేకత. గ్లోబల్ సమిట్ వేదికగా మొత్తం 83 పేజీల డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచింది. హైదరాబాద్‌ను ‘నెట్-జీరో సిటీ’గా మారుస్తూనే, గ్రామీణ ప్రాంతాలను హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ఇందులో పొందుపరిచారు. ఇన్నాళ్లూ పాలనలో ఉన్న విచక్షణా అధికారాల స్థానంలో పక్కా విధానపరమైన నిర్ణయాల వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు విజన్ డాక్యుమెంట్ తోడ్పడుతుందని ప్రభుత్వం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగు లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో, ముఖ్యంగా 65శాతం మంది యువత భాగస్వామ్యంతో, నీతి ఆయోగ్ , ఐఎస్‌బీ వంటి అంతర్జాతీయ స్థాయి నిపుణుల మేధోమథనంతో ఈ రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా ఇందులో ప్రభుత్వం ప్రకటించింది. 2034 నాటికే 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటడంతో పాటు, జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటాను పదో వంతుకు చేర్చాలన్నది టార్గెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈ డాక్యుమెంట్లో ‘జోనల్’ వ్యూహాన్ని పొందుపరిచారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను ‘కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)’గా మార్చి ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా, సేవల కేంద్రంగా మారుస్తారు. ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ‘పెరి -అర్బన్ రీజియన్ (ప్యూర్)’ గా పిలుస్తూ తయారీ రంగానికి, లాజిస్టిక్స్ హబ్‌లకు కేంద్రం చేస్తారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ అవతలి ప్రాంతమంతా ‘రూరల్ అగ్రికల్చర్ రీజియన్ (రేర్)’గా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో వర్ధిల్లనుంది. ఇది నగరాలు, పల్లెల మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ లక్ష్యాల సాధనకు మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైలు కారిడార్ వంటి పది ‘గేమ్ ఛేంజర్’ వ్యూహాలను ప్రభుత్వం రెడీ చేసింది. కేవలం మౌలిక వసతులే కాకుండా.. మహిళలు, రైతులు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, పర్యావరణ హితంగా 2047 నాటికి ‘నెట్-జీరో’ ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని నిర్ణయించింది.
వంద శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్
తెలంగాణను పూర్తి కాలుష్యరహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుతం నిర్ణయించింది. 2047 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 2030 నాటికి రాష్ట్రంలో 6 వేల ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను, 2047 నాటికి ప్రతి 20 కిలో మీటర్లకు ఒక పాస్ట్ చార్జింగ్ కారిడార్ ను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ తో నిత్యం నరకం అనుభవిస్తున్న హైదరాబాద్ ప్రజలకు ఊరటనిచ్చేందుకు 2047 నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ కొనసాగించాలని విజన్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం తన ప్రణాళికను వెల్లడించింది. ట్రాన్సిస్ట్ ఓరియెంటెండ్ డెవలప్ మెంట్( టీఓడీ ) ప్రణాళికతో రాష్ట్రంలో నడక, సైక్లింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు తగిన ప్రోత్సాహాన్ని అందించి 95 శాతం చమురు డిమాండ్ తగ్గింపును లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించింది.
అడవుల సంరక్షణకు ఏఐ
2047 కల్లా రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో ‘కార్బన్ న్యూట్రల్ స్టేట్’గా (కాలుష్య రహిత రాష్ట్రం) మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో వంతు భూభాగం పచ్చదనంతో నిండేలా 200 కోట్ల (2 బిలియన్లు) మొక్కలు నాటాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. అడవులు, వ్యవసాయ భూముల్లో పెంచే మొక్కలే కార్బన్‌ను పీల్చుకునే ‘కార్బన్ సింక్’లుగా పనిచేయాలని భావిస్తున్న సర్కారు.. ఇందుకోసం మూడు కీలక వ్యూహాలతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ‘ఫారెస్ట్ ఫస్ట్’ పాలసీని అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా అడవుల్లో హైటెక్ నిఘా ఏర్పాటు చేయనున్నారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ఏఐ, డ్రోన్లతో కాపలా వ్యవస్థను రూపొందించనున్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలైన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో తవ్వకాలు పూర్తయిన చోట ‘మైన్ టు ఫారెస్ట్’ పద్ధతిలో మళ్లీ అడవులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, ఇండస్ట్రియల్ జోన్లలో కార్బన్‌ను పీల్చుకునేలా అర్బన్ ఫారెస్టులు, గ్రీన్ బఫర్ జోన్లను డెవలప్ చేయాలని భావిస్తున్నది.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రోడ్ సెక్టార్ పాలసీ ప్రకారం.. 2047 నాటికి ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవే లను 4,983 కిలోమీటర్ల నుంచి 7,500 కిలోమీటర్లకు, స్టేట్‌హైవేలను1,687 కిలోమీటర్ల నుంచి 8,600 కిలోమీటర్లకు పెంచనున్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, ఇప్పటికే ఉన్న డబుల్ రోడ్లను ఫోర్ లేన్ రోడ్లుగా మార్చనున్నారు. సుమారు 90% ప్రాంతాలు హైవేల నుంచి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. భారత్ ఫ్యూచర్ సిటీని మచిలీపట్నం పోర్ట్‌తో కలిపే కీలక గ్రీన్‌ఫీల్డ్ హైవేతో పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం విమానాశ్రయాలకు రోడ్ కనెక్టివిటీ పెంచాలని నిర్ణయించారు. 2047 నాటికి 80 మిలియన్ ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రోడ్లను నిర్మించనున్నారు.
70 శాతం గ్రీన్ ఎనర్జీ
2047 నాటికి శుద్ధ ఇంధనం, సుస్థిర రవాణా, పర్యావరణహిత పరిశ్రమలు, స్మార్ట్ వ్యవసాయం, సుస్థిర అటవీ, హరిత పట్టణ వ్యవస్థలలో -జీరో కర్బన ఉద్గారాలు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2047 కల్లా1.33 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండగా.. 70 శాతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిదిశగా ఇప్పటికే 23 సంస్థలతో రూ.3 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నది. సోలార్, హైడ్రో, విండ్, రూఫ్‌టాప్ సోలార్, ఆఫ్-గ్రిడ్ విభాగంలో రాష్ట్రంలో 11,399 మెగావాట్ల గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి జరుగుతుండగా, 2030 నాటికి మరో 20 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. వేడి తగ్గించే రిఫ్లెక్టివ్ రూఫ్‌లను ప్రోత్సహించే ప్రత్యేక పాలసీని ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రామగుండం హైడ్రోజన్ వ్యాలీలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ హబ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. వనమహోత్సవం ద్వారా 2026–2047 మధ్య మొత్తం 2.5 బిలియన్ మొక్కలునాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ గ్రిడ్
2047 కల్లా రాష్ట్రంలోని పౌరులు, సంస్థలు, కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాలను రక్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్వాన్స్‌డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్, రియట్ టైమ్ పర్యవేక్షణలో రాష్ట్ర డిజిటల్, డీప్‌టెక్ లీడర్‌షిప్ కోర్ పిల్లర్‌గా ఈ గ్రిడ్నిలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిలెన్స్ ఎకోసిస్టమ్ ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుందని
పేర్కొంటున్నారు.
నైట్టైం క్యాపిటల్‌గా హైదరాబాద్
పల్లెల నుంచి పట్నం దాకా.. గుడి నుంచి అడవి దాకా అన్నింటినీ లింక్ చేస్తూ టూరిజం సర్క్యూట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడం, లోకల్ కల్చర్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లడం అనే లక్ష్యాలను పెట్టుకుంది. హైదరాబాద్‌ను సౌత్ ఆసియాలోనే ‘నైట్ టైమ్ క్యాపిటల్’గా మార్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు రాత్రి 2 గంటల వరకు నడిచేలా ప్లాన్చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్, ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు ఏరియాలను నైట్ జోన్లుగా మారుస్తారు. చార్మినార్ టు గోల్కొండ వయా ట్యాంక్ బండ్ మీదుగా ‘హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’ పేరుతో నైట్ బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 స్పెషల్ టూరిజం ఏరియాలను గుర్తించారు. టూరిస్టుల కోసం టికెట్లు, బుకింగ్స్, ట్రావెల్ అన్నీ ఒకే కార్డుతో అయ్యేలా ‘తెలంగాణ పాస్’ (యూనిఫైడ్ డిజిటల్ పాస్) తీసుకురానున్నారు. నాగార్జునసాగర్, సోమశిల, రామప్ప, కాళేశ్వరం అందాలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరిని ‘రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్’గా.. అమ్రాబాద్, కవ్వాల్ అడవుల్లో ఎకో ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి.
హెల్త్ సెక్టార్లో 30 వేల కోట్లు
2047 నాటికి రాష్ట్రంలో వైద్య రంగం స్వరూపాన్ని మార్చేసేలా రూపొందించిన ‘విజన్ డాక్యుమెంట్’లో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను ప్రతిపాదించింది. ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా.. ప్రజల జేబుకి చిల్లు పడకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ఈ విజన్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దాదాపు 30 వేల కోట్లు వైద్య మౌలిక వసతులపై ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
- నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ కేర్
- 30+ స్క్రీనింగ్: 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
- క్యాన్సర్ చికిత్స: రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ. డయాలసిస్ కేంద్రాలు, డే-కేర్ కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు
- క్యూర్,ప్యూర్,రేర్ మోడల్: దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు, అరుదైన వ్యాధుల చికిత్సకు ప్రత్యేక విధానం
- డిజిటల్ హెల్త్ అండ్ టెక్నాలజీ
- డిజిటల్ హెల్త్ కార్డ్స్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. పేషెంట్ హిస్టరీ ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు
- టెలి-మెడిసిన్: మారుమూల గ్రామాలకు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందేలా టెలి-ఐసీయూ, టెలి-కన్సల్టేషన్ సేవలు. వ్యాధుల గుర్తింపులో, స్క్రీనింగ్‌లో ఏఐ వినియోగం.

