- ఫండ్స్, పర్మిషన్ల కోసం కొట్లాడండి..
- పార్లమెంట్‌లో ఎంపీలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలి
- రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన
- మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం కోసం పోరాడాలి
- బుల్లెట్ రైళ్లు, వరంగల్, ఆదిలాబాద్
- ఎయిర్‌పోర్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- నదీ జలాల్లో న్యాయమైన వాటా, ఏపీ నుంచి రావాల్సిన ఎన్వోసీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకతీతంగా పార్లమెంట్‌లో గళమెత్తాలని ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ఫండ్స్, పర్మిషన్లు సాధించుకోవాలన్నారు. కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, ఐఐఎం, బుల్లెట్ రైళ్లు, వరంగల్-, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన అనుమతులతోపాటు అంతర్రాష్ట్ర నదీ జలాల వాటాలు, ఏపీ నుంచి రావాల్సిన ఎన్వోసీల సాధన కోసం పోరాడాలన్నారు.
త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎంపీలకు అవసరమైన పూర్తి సమాచారాన్ని, పెండింగ్ ఫైళ్ల వివరాలను తక్షణమే అందించేందుకు వీలుగా ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను కోఆర్డినేటర్‌గా నియమించినట్టు వెల్లడించారు.
మెట్రో, ట్రిపుల్ ఆర్‌పై ప్రత్యేక నజర్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-–1 స్వాధీనం, ఫేజ్-–2 విస్తరణకు సంబంధించి కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు కన్సల్టెంట్‌గా ‘ఎస్‌బీఐ క్యాప్స్’ను నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభంతోపాటు దక్షిణ భాగం భూసేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చేలా ఎంపీలు ప్రయత్నించాలన్నారు. మూసీ పునరుజ్జీవం పనులు మొదటి దశ టెండర్ల స్థాయికి వచ్చిందని, ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ కింద దీనికి కేంద్ర అప్రూవల్ లెటర్ సాధించేందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవాలని సూచించారు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఇటీవల జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్నాటక సీఎంలతో జరిగిన చర్చలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన 15.09 టీఎంసీల నీరు పూడిక వల్ల 5 టీఎంసీలు కూడా రావడం లేదని, పూడిక తొలగింపునకు ఏపీ, కర్నాటక సహకరించేలా కేంద్ర మంత్రిపై ఒత్తిడి తేవాలన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని తరలించే విషయంలో చత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యతను కేంద్రం తీసుకుందని సీఎం తెలిపారు.
చత్తీస్‌గఢ్ వాటాలోని మిగులు జలాల ద్వారా తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు. ‘‘నీళ్లు చత్తీస్‌గఢ్‌వి.. నిధులు కేంద్రానివి.. ఆ రెండింటినీ తెలంగాణకు అనుకూలంగా సాధించాలి’’ అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎన్వోసీ సాధిస్తే అడ్డంకులు తొలగుతాయని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ప్రతిపాదించారు.
ఎయిర్‌పోర్టులు, బుల్లెట్ రైళ్లు..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైకి వెళ్లే బుల్లెట్ రైళ్ల అలైన్‌మెంట్లు కొలిక్కి వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని.. అక్కడ ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగే సమాచారాన్ని వేగంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవి అందరినీ సమన్వయం చేసుకోవాలని సూచించారు.
సమాఖ్య స్ఫూర్తితో ముందుకెళ్తాం: భట్టి విక్రమార్క
సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో సహకార ధోరణిలోనే ముందుకు సాగుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎంపీలు అడిగిన ప్రతి సమాచారాన్ని అధికారులు తక్షణమే అందజేయాలని, గతంలో కేంద్రానికి పంపిన లేఖల ప్రస్తుత స్థితిని నివేదిక రూపంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ , సీఎస్ సంజయ్ జాజు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.
సమావేశంలో ఎంపీల ప్రశ్నలు.. సూచనలు:
మల్లు రవి: గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్ మిల్లు పునరుద్ధరణపై ప్రశ్నించగా.. 7-8 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి: పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఇలాంటి సమావేశాలను చాలా ముందుగానే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈటల రాజేందర్: రాష్ట్రంలో ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజీ సమస్య ఉందని, దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రామసహాయం రఘురామిరెడ్డి: ఎంపీలు ఉండే స్టాండింగ్, కన్సల్టెన్సీ కమిటీల ఆధారంగా పెండింగ్ విషయాలు తెలిస్తే పార్లమెంట్ కమిటీల్లో ప్రశ్నించడానికి వీలవుతుందన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి: కాళేశ్వరం, పాలమూరు–-రంగారెడ్డి డిజైన్లలో లోపాలున్నాయని, నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు.
