హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు ఎనిమిది రోజులు అక్కడ పర్యటించిన ఆయన.. సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో రూ.31,532 కోట్ల పెట్టుబడులను సాధించింది.
అమెరికా వేదిక గా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించడంతోపాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు ప్రభు త్వంతో కలిసి పని చేసేందుకు అవగాహనా ఒప్పందాలు చేసుకున్నాయి.దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
ప్రముఖ కంపెనీలతో సమావేశాలు
సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికా పర్యటనకు బయల్దేరింది. మరుసటిరోజు మంత్రి శ్రీధర్ బాబు, మరికొందరు అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. సీఎం సారథ్యంలో అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్స్, మూడు రౌండ్ మీటింగ్లలో పాల్గొన్నారు. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి.
ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ అంగీకరించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.
చర్చలతో సరికొత్త భాగస్వామ్యానికి నాంది: రేవంత్
శనివారం అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్‌రెడ్డి దక్షిణ కొరియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని తెలిపారు. తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం శుభసూచకమని ఆయన అన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
దక్షిణ కొరియాకు వెళ్లిన సీఎం రేవంత్
సౌత్ కొరియాలో సోమవారం పలు కంపెనీల తో సీఎం భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ సమావేశంలో పాల్గొంటారు. ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుందయ్ మోటర్స్ ప్రతినిధులతోనూ భేటీకానున్నారు. మంగళవారం కూడా సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలోనే ఉండనున్నారు. హన్ రివర్ ప్రాజెక్ట్, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్, శ్యామ్‌సంగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ నెల 14న ఉదయం సీఎం రేవంత్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
