
కామారెడ్డి: నేను ఆనాడు చెప్పా.. ఈనాడు చెబుతున్నా.. నా సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎంత సాయం చేస్తానో.. కామారెడ్డికి అంతే సాయం చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వరదకు కామారెడ్డిలోని పలు కాలనీలు నీట మునిగాయి. వేల ఎకరాల పంట వరదలకు కొట్టుకుపోయింది. వర్షం, వరదలతో అల్లాడిపోయిన వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం (సెప్టెంబర్ 4) సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించారు.
వరదలకు పూర్తిగా జలమయమైన జీఆర్ కాలనీని సందర్శించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడి.. వారి సాదకబాదకాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షం, వరదలతో కామారెడ్డి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చామని.. అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్లే ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం తగ్గించగలిగామన్నారు సీఎం రేవంత్.
వరదలు రాగానే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందిగా ఇంచార్జ్ మంత్రి సీతక్కను, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలను ఆదేశించానని.. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశానని చెప్పారు. అయినప్పటికీ ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానన్నారు. పూర్తి స్థాయి వరద నష్టంతో పాటు మళ్లీ ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.
మీ సమస్యల పరిష్కారానికి వంద శాతం ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వరదల్లో కొట్టుకుపోయిన విద్యార్థుల పుస్తకాలు, ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, పశు సంపదను కోల్పోయిన వారికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని వరద బాధితులకు భరోసా కల్పించారు.