రేపు( డిసెంబర్ 19) ఢిల్లీకి సీఎం రేవంత్​!.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే చాన్స్​

 రేపు( డిసెంబర్ 19) ఢిల్లీకి సీఎం రేవంత్​!.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే చాన్స్​

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. అక్కడ ఏఐసీసీ చీఫ్ ​మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హైకమాండ్​ పెద్దలతో రాష్ట్ర కేబినెట్​ విస్తరణపై చర్చించే చాన్స్​ ఉందని అంటున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పాలనలో జోరు చూపిస్తున్న రేవంత్​రెడ్డి.. పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే మరింత వేగంగా పనిచేసేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్​లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్​ పదవుల భర్తీపైనా పార్టీ హైకమాండ్​తో సీఎం రేవంత్​ చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే  గత ప్రభుత్వం నియమించిన 54 కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను  రద్దు చేస్తూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

నేడు పీఏసీ భేటీ

గాంధీభవన్​లో సోమవారం పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పీఏసీ సమావేశం ఇది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే, సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఈ  సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పలువురు మంత్రులూ పాల్గొననున్నారు. ఇందులో నామినేటెడ్​ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంగళవారం హైకమాండ్​కు సీఎం రేవంత్​ వివరించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు బుధవారం, గురువారం అసెంబ్లీ సమావేశాలున్నాయి. సోమవారం పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యలో ఒక్క రోజు(మంగళవారం) మాత్రమే గ్యాప్​ ఉన్నది. ఈ ఒక్కరోజులోనే సీఎం రేవంత్​ ఢిల్లీకి వెళ్లి రావాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సీఎం ఢిల్లీకి వెళ్తే రెండురకాలుగా కలిసి వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

రేవంత్​కు  జోగులాంబ అర్చకుల ఆశీర్వచనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ప్రధాన అర్చకులు, అర్చక బృందం కలిశారు. ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా సీఎంకు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. 

రేవంత్​తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ

ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు, అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్​ని సీఎం నివాసంలో సమావేశమై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. గత ప్రభుత్వ అప్పులు, అవలంబించిన ఆర్థిక విధానాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు.