
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంతో కేబినెట్ విస్తరణ కోసమేనని ఊహాగానాలు వినిపించాయి. మంత్రి పదవులు ఆశిస్తోన్న ఆశావహులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో చేసిన కుల గణన గురించి రాహుల్ గాంధీకి వివరించానని తెలిపారు.
కేవలం కుల గణన, ఎస్సీ వర్గీకరణపై మాత్రమే రాహుల్ గాంధీతో చర్చించానని.. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యకర్గ కూర్పుపై ఎలాంటి డిస్కషన్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ క్యార్గవర్గంపై చర్చించేందుకే ఈ భేటీ అన్న ఊహాగానాలు రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు. కేబినెట్ విస్తరణ అంశం హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని.. ఉప ఎన్నికలు వస్తాయో రావో కేటీఆరే చెప్పేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి ఏ బీ ఫామ్ మీద గెలిచారు..? ఎవరి మంత్రి వర్గంలో పనిచేశారు..? తలసాని శ్రీనివాస్ 2014లో గెలిచింది ఏ బీ ఫామ్ మీద, మంత్రిగా పనిచేసింది ఎవరి ప్రభుత్వంలో..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కుల గణన, ఎస్సీ వర్గీకరణలో కమిషన్లు ఇచ్చే నివేదికలు చట్టబద్ధం చేస్తామని చెప్పారు. వీటిలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదన్నారు. రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపుతామని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కుల గుణన, ఎస్సీ వర్గీకరణ చట్టరూపంలో తీసుకొచ్చి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు.