గ్లోబరీనా పాపం బీఆర్ఎస్‌దే.. నాడు ఇంటర్ బోర్డులోనే ఏరిపారేస్తే... ఇయ్యాల ‘నీట్’ దాకా వచ్చేదా..?: సీఎం రేవంత్

గ్లోబరీనా పాపం బీఆర్ఎస్‌దే.. నాడు ఇంటర్ బోర్డులోనే ఏరిపారేస్తే... ఇయ్యాల ‘నీట్’ దాకా వచ్చేదా..?: సీఎం రేవంత్
  • రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు.. వాళ్లకు అధికారం కావాలి
  • స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తూ మెట్రో, ఆర్ఆర్ఆర్‌‌లాంటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నరని ఫైర్​ 
  • ఉద్యోగులు గంట ఎక్కువ పనిచేయాలి.. ఆదాయం పెంచాలి 
  • పెరిగే ప్రతి పైసాను ఉద్యోగులు, ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తాం 
  • ‘ఔను నేను గుంపు మేస్త్రీనే.. ఉద్యోగులు, పేద ప్రజల గుంపంతా నాదే..’ అని కామెంట్   
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమాను ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాడు ఇంటర్మీడియెట్ పిల్లల ప్రాణాలు బలితీసుకున్న గ్లోబరీనా సంస్థనే.. ఇయ్యాల లక్షలాది మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పుడే తప్పు చేసిన వాడిని శిక్షించి ఉంటే.. ఇయ్యాల పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుండెనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని సీఎం పేర్కొన్నారు. 

అందుకోసం ఉద్యోగులందరూ రోజుకు ఒక గంట పాటు అదనంగా శ్రమించి, పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలన్నారు. తాను గుంపు మేస్త్రీనేనని ఉద్యోగులు, పేద ప్రజల గుంపంతా తనదేనని అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించే పథకానికి సంబంధించి వివిధ బ్యాంకులతో రాష్ట్ర సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఇయ్యాల నర్సరీ నుంచి12వ తరగతి వరకు విద్యా ప్రమాణాలు పెంచాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు బ్రేక్‌‌ఫాస్ట్, లంచ్‌‌తో పౌష్టిక ఆహారం అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. గ్లోబరీనా వాళ్లదే కదా. ఆ సంస్థ పిల్లల జీవితాలతో చెలగాటమాడి 25 మంది అమాయక ఇంటర్మీడియెట్ పిల్లల ప్రాణాలు బలితీసుకుంటే.. దానిపై మా ఉద్యోగ ప్రతినిధి మధు మాట్లాడిండని ఆయనను చంచల్‌‌గూడ జైలుకు పంపారు. 

ఆ రోజు తప్పు చేసిన వాడిని వదిలేశారు. ఇయ్యాల వాడే ఒక తాచుపామై, ఈరోజు నీట్ పరీక్షల ద్వారా లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుండు. ఆ రోజే వాడిని రెండు దెబ్బలు వేసి చంచల్‌‌గూడలో చిప్పకూడు పెట్టించి ఉంటే.. ఇయ్యాల దేశంలో పిల్లల జీవితాలతో వాడు చెలగాటమాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వీళ్లు ఆలోచన చేసిండ్రా? ఇయ్యాల మేం విద్యా వ్యవస్థను బాగు చేస్తుంటే బురదజల్లుతున్నారు”అని సీఎం ఫైర్ అయ్యారు.     

అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నరు 

ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా ఫామ్‌‌హౌస్‌‌లకే పరిమితమైన నేతలు విదేశాలకు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రజోపయోగ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. 

మెట్రో రైళ్లను సామాన్య మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కుతారని, అలాంటి వ్యవస్థలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ తమకు రాజకీయాధికారం కావాలనే దురాశతో కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.    

పదవి శాశ్వతం కాదు.. రేవంతన్నా అంటేనే ఇష్టం 

ప్రతిపక్షాలు తనను గుంపు మేస్త్రీ అంటున్నాయని, ఔను.. తాను గుంపు మేస్త్రీనేనని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘చాలా మంది నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తారు. నేనేమీ అనుకోను.. ఔను, నేను గుంపు మేస్త్రీనే. ఈ గుంపంతా నాదే. ఈ గుంపే నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని పేద ప్రజలకు తీసుకెళ్లేది. మా ప్రభుత్వానికి, పేద ప్రజలకు మధ్య వారధి ఈ గుంపే. కొంతమంది మాదిరిగా దొర పోకడలు నా దగ్గర లేవు. జెడ్‌‌పీటీసీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా.. పీసీసీ చీఫ్‌‌గా ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమతో 'రేవంత్ అన్నా' అని ఎలా పిలిచారో, ఈరోజు సీఎంగా ఉన్నా కూడా అలా పిలిస్తేనే నాకు ఇష్టం. 

జెడ్‌‌పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వచ్చాయి, పోయాయి. ఈరోజు సీఎం పదవి వచ్చింది. రేపు ఇది కూడా పోవచ్చు. హోదా, పదవి మారొచ్చు కానీ. మీకూ నాకూ మధ్య ఉన్న ఈ అన్నదమ్ముల బంధం శాశ్వతం. సార్ అనో, దొర అనో పిలిపించుకుంటే.. పిలిచేటోడు దొరుకుతావు కదా బిడ్డ.. చూసుకుందాం అని మనసులో అనుకుంటాడు” అని సీఎం చమత్కరించారు.    

వడ్డీల భారం ఏటా రూ.76 వేల కోట్లు  

ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2024 నుంచి ప్రారంభమైన భారీ రిటైర్మెంట్ల వల్ల ప్రతి నెలా రూ. వెయ్యి కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. అయినప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లోనే రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే మొదటి విడత కింద రూ. 2 వేల కోట్లు విడుదల చేశామన్నారు. 

ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) కోసం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలనేది ఒక హక్కుగా భావించి అమ లు చేస్తున్నామన్నారు. గత పాలకులు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకులు రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం విమర్శించారు. 

గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీ రేట్లు అత్యంత భారంగా, దాదాపు 11.5 శాతం నుంచి 11.90 శాతం వరకు ఉన్నాయన్నారు. తాము అప్పుల రీస్ట్రక్చరింగ్‌‌తో వడ్డీ భారాన్ని 7.25 శాతానికి తగ్గించగలిగామని స్పష్టం చేశారు. గత పాలకుల తప్పుల వల్ల నేడు ఏటా రూ.76 వేల కోట్ల మేర కేవలం వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి వస్తోందన్నారు.  

త్వరలోనే క్యాష్‌‌లెస్ హెల్త్ కార్డ్స్: భట్టి  

ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్‌‌ల సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో త్వరలో  క్యాష్‌‌లెస్ వైద్య సేవలు అందించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందన్నారు.

 ప్రస్తుత కాలంలో ఇండ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఇన్‌‌స్టాల్మెంట్స్ (ఈఎంఐలు) కడుతున్నారన్నారు. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్‌‌గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేదని, తమ ప్రభుత్వం రాగానే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ, ద్యోగుల హక్కులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. 

ఆదాయం పెంచే బాధ్యత తీస్కోవాలి 

చట్ట ప్రకారం ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని పెంచే బాధ్యతను ఉద్యోగులు భుజాన వేసుకోవాలని, అలా పెరిగిన ప్రతీ పైసాను తిరిగి ఉద్యోగుల జీతభత్యాలకు, పీఆర్సీ అమలుకు, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పటికే జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతోంద ని, దీనిని వృథా కాకుండా చూస్తున్నామని తెలిపారు. ఆదాయం పెంపుదల సాధిస్తే భవిష్యత్తులో ఉద్యోగుల ఆర్థిక అవసరాలను మరింత ఉదారంగా తీర్చేందుకు వీలవు తుందన్నారు.

 రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా మార్చేందుకు 'తెలంగాణ రైజింగ్ 2047' ప్రణాళికను రూపొందించి నట్లు సీఎం వివరించారు. దేశ జనాభాలో కేవలం రెండున్నర శాతంగా ఉన్న తెలంగా ణ, ప్రస్తుతం దేశ జీడీపీలో ఐదు శాతం వాటాను అందిస్తోందని చెప్పారు. భవిష్య త్తులో ఈ వాటాను పది శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 

కాగా, నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నిర్మిస్తున్నామన్నా, కోటి మందికి పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపా యం కల్పిస్తున్నామన్నా అది ఉద్యోగుల చొరవ వల్లే సాధ్యమైందని సీఎం అన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు తాము తీసుకు న్నప్పటికీ, వాటికి జీవం పోసి విజయవంతం చేస్తున్నది ఉద్యోగులేనని చెప్పారు.