హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని అన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేమని.. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
నిధులకు ఎలాంటి ఆటంకం లేదని.. గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం (నవంబర్ 3) ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర సీఎం రేవంత్ సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక శాసనసభ్యులతో కలిసి సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టామని తెలిపారు.
ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించి ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఎన్జీఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్‌లో ఉందని.. పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరాకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983లో పునాది పడినప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదని పేర్కొన్నారు. తిరిగి 2004లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆనాడు దాదాపు 33 కి.మీ పూర్తి చేయగా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రాజెక్టును ప్రారంభించిన నాడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారని తెలిపారు.
దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టు అని.. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని.. గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కోట్లు చెల్లించామని అన్నారు.
ఎస్ఎల్‌బీసీతో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదని అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని కారణంగా మన వాటా మనం వాడుకోలేకపోయామని.. నికర జలాల హక్కులు కలిగినప్పటికీ పదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో తెలంగాణలోని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభ్యంతరం చెబుతోందని అన్నారు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ఆ ఘటన మాకెంతో బాధ కలిగించిందని.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నామని చెప్పారు. అందుకే అనుభవం, అత్యంత నైపుణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పించామని.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నామని తెలిపారు.
ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టామని.. పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాలతోనే ఈనాడు పనులు పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి మర్లపాడు తండా, కేశీ తాండా, నక్కలగండి తాండా వాసులకు డిసెంబర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని భరోసా కల్పించారు.
