సీఎం రేవంత్​ దావోస్​ టూర్​.. 30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

 సీఎం రేవంత్​ దావోస్​ టూర్​..  30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
  • సీఎం రేవంత్​ దావోస్​ టూర్​..  30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
  • పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం దావోస్​ టూర్​
  •  పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా 
  • సీఎం రేవంత్​ దావోస్​ టూర్​
  • ఫార్మా, ఆగ్రో, హెల్త్​, రియల్​ ఎస్టేట్​పై ఫోకస్​
  • పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ వచ్చారు. ఇప్పుడు దావోస్​లో జరగనున్న వరల్డ్​ ఎకనామిక్​ ఫోరంలో భారీగా ఇన్వెస్ట్​మెంట్లను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

పెద్ద కంపెనీలు వాటి వివిధ విభాగాల వ్యాపార విస్తరణకు తెలంగాణను డిస్టినేషన్​గా మార్చాలని చూస్తున్నారు. దావోస్​ పర్యటనలో కనీసం రూ.25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల  మేర పెట్టుబడులు రప్పించాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రంలోని యువతకు అత్యధిక ఎంప్లాయిమెంట్​ కల్పించే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన మెగా మాస్టర్ పాలసీ ఎలా ఉంటుందనే దానిపై దావోస్​ మీటింగ్​లో ఇండస్ట్రియలిస్ట్​లకు సీఎం తెలియజేయనున్నారు. 

రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే వివిధ ప్రొఫెషనల్​ కోర్సులు చేస్తున్న యువతకు ఎంప్లాయిమెంట్​ కల్పించాలనుకుంటున్నది. హైదరాబాద్​తోపాటు రాష్ట్రమంతటా పరిశ్రమల అభివృద్ధికి కసరత్తు చేస్తున్నది. దావోస్​లో జరిగే వరల్డ్​ ఎకనామిక్​ ఫోరంలో ఈ నెల 15 నుంచినాలుగు రోజులు సీఎం రేవంత్​ పాల్గొని పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలపై ఆయన చర్చలు జరుపనున్నారు.

ఫార్మా, ఆగ్రో, హెల్త్​, రియల్​ ఎస్టేట్​పై ఫోకస్​

రాష్ట్రంలో అనుకూలమైన భౌగోళిక వాతావరణం, రవాణా సదుపాయాలు, అపారమైన  వనరులను దృష్టిలో ఉంచుకొని ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్ రంగాలన్నింటినీ విస్తరించాలని రాష్ట్ర సర్కారు అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇండస్ట్రీస్​ ఫ్రెండ్లీ విధానంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.