తెలంగాణలో వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం: సీఎం రేవంత్

తెలంగాణలో వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం: సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన  రేంవంత్..  ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.  అవసరమైతే  ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తెస్తామన్నారు. మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామన్నారు.

 2023 డిసెంబర్లో ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ బలమైన వాదనలు వినిపంచిందన్నారు రేవంత్.  కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీం అనుకూల తీర్పు ఇచ్చిందని చెప్పారు.  వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పి.. కేసీఆర్ మాదిగలను మోసం చేశారని విమర్శించారు.   మాదిగ సోదరులకు న్యాయం చేయడానికి  తాము ముందుంటామన్నారు.  ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ సోదరులు ఎంతో  పోరాటం చేశారని చెప్పారు. వారి పోరాటానికి తగ్గ ఫలితం దక్కిందన్నారు రేవంత్. 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం అనుకూల తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వర్గీకరణను సమర్థించిన సుప్రీం..  దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది.