పదేండ్లు దోచుకున్న దొంగలు మళ్లొస్తున్నరు: సీఎం రేవంత్ రెడ్డి

పదేండ్లు దోచుకున్న దొంగలు మళ్లొస్తున్నరు: సీఎం రేవంత్ రెడ్డి
  • ఉప ఎన్నికలో వాళ్లకు కర్రుకాల్చి వాత పెట్టండి.. జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
  • సొంత ఆడబిడ్డను అవమానించినోళ్లు.. మహిళల్ని గౌరవిస్తరా?
  • ఆటోవాలాలను బిల్లారంగాలు రెచ్చగొడ్తున్నరు
  • ఫ్రీ బస్సు బంజేయాలని కేటీఆర్, హరీశ్ చూస్తున్నరు  
  • గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను పెంచి పోషించినోళ్లు రౌడీలా?
  • పేదలకు అండగా ఉండేటోళ్లు రౌడీలా? 
  • హైదరాబాద్ అభివృద్ధిని కిషన్‌‌‌‌రెడ్డి అడ్డుకుంటున్నడు 
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌తో కుమ్మక్కై మెట్రో, మూసీ ప్రాజెక్టుల్ని ఆపుతున్నడని ఫైర్ 
  • జూబ్లీహిల్స్‌‌‌‌లో సీఎం రోడ్‌‌‌‌ షోలు, కార్నర్ మీటింగ్స్‌‌‌‌ 


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రౌడీలు ఎవరో ప్రజలకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను పెంచి పోషించినోళ్లు రౌడీలా? లేక పేదలకు అండగా ఉండేటోళ్లు రౌడీలా? జూబ్లీహిల్స్ ప్రజలారా.. మీరే ఒక్కసారి ఆలోచించండి” అని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేదలకు అండగా ఉంటున్నారని, ఆయనను ఉప ఎన్నికలో గెలిపించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి వెంగళరావు నగర్, సోమాజిగూడలో నిర్వహించిన రోడ్‌‌‌‌ షోలు, కార్నర్ మీటింగ్స్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు దోచుకున్న దొంగలు మళ్లీ ముసుగు వేసుకునిజూబ్లీహిల్స్​కు వస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.  ‘‘బీఆర్ఎస్ వాళ్లు సొంత ఆడబిడ్డను జైలుకు పంపారు. బయటకు వచ్చిన తర్వాత ఆమెను ఆదరించకుండా అవమానిస్తున్నారు. ఆమె ఊరూరా తిరుగుతూ వీళ్ల దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. సొంత ఆడబిడ్డను ఆదరించని వాళ్లు..ఇతర మహిళలను ఎలా గౌరవిస్తారు?” అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. బిల్లారంగాలు దోపిడీ దొంగలని, వారికి కేటీఆర్, హరీశ్ వారసులని విమర్శించారు. ‘‘ కేటీఆర్, హరీశ్ ఆటోల్లో తిరుగుతూ ఫొటోలు దిగుతున్నారు. మేం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. వాళ్లిద్దరూ ఆటోవాళ్లను రెచ్చగొట్టి ఫ్రీ బస్సు బంజేయాలని చూస్తున్నారు” అని మండిపడ్డారు.  

బీజేపీ, బీఆర్ఎస్‌‌ది ఫెవికాల్ బంధం.. 

బీజేపీ, బీఆర్ఎస్‌‌ది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ, తెచ్చిందేమీ లేదని మండిపడ్డారు. ‘‘రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్లు తెలంగాణకు ఏమైనా నిధులు తెచ్చారా? ఆ పార్టీ నేతలు సిగ్గు లేకుండా జూబ్లీహిల్స్‌‌లో కార్పెట్ బాంబింగ్ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రానికి మోదీ ఏం ఇచ్చారని బీజేపీ ఎంపీలు ఇక్కడ తిరుగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించింది. మేం హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. నంగనాచి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నడు. మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నడు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌‌కు ఎక్కడ పేరొస్తుందోనన్న భయంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌తో ఆయన కుమ్మక్కయి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌‌కు మంత్రి పదవి ఇస్తే, బీజేపీకి ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. 

సెంటిమెంట్ పన్జేయ్యదు.. 

జూబ్లీహిల్స్‌‌లో సెంటిమెంట్‌‌తో గెలవాలని బీఆర్ఎస్ చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ‘‘నవీన్ యాదవ్‌‌ను గెలిపిస్తే అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడు. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. జూబ్లీహిల్స్‌‌లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారు.

 అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది. జూబ్లీహిల్స్ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్‌‌లోనూ సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కార్చారని, కానీ అక్కడి ప్రజలు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్‌‌ను గెలిపించారని గుర్తుచేశారు. పదేండ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడైనా జూబ్లీహిల్స్‌‌కు వచ్చారా? ఇక్కడి సమస్యలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో మళ్లీ పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. సంక్షేమ పథకాలన్నీ బంద్ అయితయ్. సన్నబియ్యం రావు.. ఫ్రీ బస్సు ఉండదు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వరు.. రేషన్ కార్డులు రద్దు చేస్తారు” అని అన్నారు. ప్రచార కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.  

మాది పేదల ప్రభుత్వం: పీసీసీ చీఫ్  

తమది పేదల ప్రభుత్వమని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ‘‘ఇందిరమ్మ పాలనలో రాష్ట్రంలో పేదలకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. నవీన్ యాదవ్‌‌ను గెలిపిస్తే మరిన్ని పథకాలు అమలవుతాయి. నిత్యం పేదలు, వాళ్ల సంక్షేమం గురించి ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సానుభూతి ఓట్లు అడిగే హక్కు.. కేసీఆర్‌‌‌‌కు లేదు

ఆనాడు పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలిపింది కేసీఆర్ కాదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘2007లో పేదల దేవుడు పీజేఆర్ అకాల మరణం చెందారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఉప ఎన్నికలో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రతిపక్షాలైన బీజేపీ, టీడీపీ కోరాయి. కానీ పీజేఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపింది కేసీఆర్ కాదా? ఈ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది కేసీఆర్ కాదా? అలాంటి వాళ్లు.. ఇప్పుడు  సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఆనాడు పీజేఆర్‌‌‌‌పై పోటీ పెట్టిన మీకు.. ఇవ్వాళా సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు” అని కేసీఆర్‌‌‌‌పై మండిపడ్డారు.