కిషన్ రెడ్డి కింగ్ కాదు కదా.. బొంగు కూడా కాడు: CM రేవంత్ కౌంటర్

కిషన్ రెడ్డి కింగ్ కాదు కదా.. బొంగు కూడా కాడు: CM రేవంత్ కౌంటర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కింగ్ అవుతానని కిషన్ రెడ్డి అంటున్నాడు.. కానీ ఆయన బొంగు కూడా కాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి ఎవరు భయపడరని.. అహంతో విర్రవీగిన కేసీఆర్‎నే ఓడించి ఫామ్‎హౌస్‎కి పంపించామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ తెచ్చుకున్న ఆ పార్టీ గెల్చినట్లేనని ఎద్దేవా చేశారు. 

బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని.. కాంగ్రెస్‎ను ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్‎ను బండకేసి కొట్టాలని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.. మరీ కాళేశ్వరం కేసును తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ముందు మోడీ ఇంటికి వెళ్లి గజదొంగ కేసీఆర్‎పైన ఎందుకు చర్యలు తీసుకోలేదో అడగాలని సూచించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం (నవంబర్ 5) యూసఫ్ గూడ డివిజన్‎లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎కి 30 వేల మెజార్టీ ఇవ్వాలని.. నవీన్ యాదవ్ విజయం సాధిస్తే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు, జూబ్లీహిల్స్‎కు చేసిందేమి లేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ నక్కలు మేక తోలు కప్పుకొని వస్తున్నాయని.. అలాంటి వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డాయని.. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కనీసం నంది అవార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డులు తీసుకొచ్చి నటుల ప్రతిభను గుర్తించిందన్నారు. పదేండ్లు కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని.. సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.