హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఫోర్త్ సిటీ లాంటి ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను.. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈగల్లాంటి టీమ్‌లను ఏర్పాటుచేశారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం పదేపదే చెప్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్బైపోల్ ప్రచా రంలోనూ ఆయన ఇవే అంశాలను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ఓటర్లు కాంగ్రెస్‌కు భారీ విజయం కట్టబెట్టడంతో హైదరాబాద్కేంద్రంగా సీఎం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజామోదం లభించినట్లయింది.
ఈ జోష్‌తో ఆయా ప్రాజెక్టులను సీఎం రేవంత్మరింత వేగంగా ముందుకుతీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ఘన విజయం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక ప్రణాళిక ఎంతగానో పనిచేసిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. మంత్రి వివేక్‌వెంకటస్వామికి జూబ్లీహిల్స్ప్రచార బాధ్యతలను జూన్చివర్లోనే సీఎం రేవంత్ అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడ్తూ.. నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలు గుర్తించి, పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం మీ వెంట ఉందనే భరోసాను వివేక్ వెంకటస్వామి కల్పించారు. మంత్రి వివేక్‌కు తోడుగా ఆగస్టులో మరో ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ముగ్గురూ కలిసి వివిధ వర్గాలతో వరుస భేటీలు జరుపుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్పెంచారు.
ఇక చివరి నెలలో మూడో వ్యూహంగా డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించిన సీఎం.. స్వయంగా పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేస్తూ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రెండేండ్ల పాలనతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు చెప్తూ.. బీఆర్‌ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టారు. పార్టీ అభ్యర్థిగా యువకుడు, స్థానికంగా మంచిపేరున్న నవీన్ యాదవ్‌ను ప్రకటించేలా హైకమాండ్‌ను ఒప్పించడంలోనూ సీఎం కీలక పాత్ర పోషించారు. ఇదే విజయానికి టర్నింగ్ పాయింట్అయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వరుసగా రెండు బైపోల్స్‌లో విజయ దుందుభి
జూబ్లీహిల్స్ విజయం అధికార పార్టీ కాంగ్రెస్‌కు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనకు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రజామోదం లభించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. 2024 జూన్‌లో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ రెండో విజయం. ఈ రెండూ బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు స్థానాలను సొంతం చేసుకున్నది.
