రూ.40 వేల కోట్ల పెట్టుబడులు..35 వేలకు పైగా కొలువులు

రూ.40 వేల కోట్ల పెట్టుబడులు..35 వేలకు పైగా కొలువులు
  • ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే
  • ఇన్వెస్ట్​మెంట్ ల ఆకర్షణలో రాష్ట్రం​సరికొత్త రికార్డు

ఢిల్లీ: ఇన్వెస్ట్​మెంట్లను ఆకర్షించటంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వేదికపై ప్రత్యేకతను చాటుకుంది. దావోస్ లో మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్‌ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో  ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ భారీగా పెట్టుబడులకు తమ ఆసక్తి ప్రదర్శించాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద వెల్లువెత్తింది. దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. 

దావోస్ లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికగా 2020లో రూ.500 కోట్లు, 2022 లో రూ.4,200 కోట్లు, 2023లో రూ.21వేల కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల వ్యవధిలోనే అంతకు రెట్టించిన పెట్టుబడులు (దాదాపు రూ.40 వేల కోట్లు) రాష్ట్రానికి తరలివచ్చాయి. వీటితో 35 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. టాటా గ్రూప్, అదానీ, జిందాల్, గోడి ఇండియా, వెబ్ వెర్క్స్, ఆరాజెన్ లైఫ్ సైన్సెస్, గోద్రెజ్ ఇండియా, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, ఊబర్, క్యూ సెంట్రియో, ఓ9 సొల్యూషన్స్ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణలో వివిధ రంగాల్లో తమ ప్రాజెక్టుల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి.