- పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
- సీఎం రేవంత్ వార్నింగ్.. మున్సిపల్ శాఖపై రివ్యూ
- మున్సిపల్ కమిషనర్లు ఏసీ గదులను వదిలి ఉదయం 6 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలి
- త్వరలో ప్రతి జోన్‌లో ఆకస్మిక పర్యటనలకు వస్తా
- ప్రకటనల ఆదాయం పెరగాలి.. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- జంక్షన్లలో స్మార్ట్ పోల్స్.. రద్దీ ఏరియాల్లో స్కైవాక్ బ్రిడ్జీలు కట్టాలి
- మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ఒక్కరోజు శిక్షణ ఇవ్వాలని సూచన
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధితోపాటు రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే సహించేది లేదని, తాను ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు రోడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తే.. బాధ్యులైన అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని స్పష్టం చేశారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో విభజన, ఇతర సమస్యల పరిష్కారం, ఆదాయ పెంపునకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఏసీ గదులకు పరిమితం కాకూడదని ఆదేశించారు.
తెల్లవారుజామున 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్‌కు పెద్దపీట వేయాలన్నారు. త్వరలోనే తాను ప్రతి జోన్‌లో పర్యటిస్తానని తెలిపారు. నగరంలో భారీ ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు కనిపిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలు, అధికారులపై చర్యలు తీసు కోవాలన్నారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించి, మన దగ్గర కూడా ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేయాలని సూచించారు.
అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుల నుంచి ఏడాదికి ఒకసారి ఫీజు వసూలు చేయాలన్నారు. అనధికార బోర్డులను వెంటనే తొలగించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం 10 శాతం బోర్డులను తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించారు.
స్మార్ట్ పోల్స్, స్కైవాక్‌లపై అధ్యయనం
నగరంలోని జంక్షన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ‘స్మార్ట్ పోల్స్’ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు అన్నీ ఈ పోల్స్‌పైనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో స్కైవాక్ బ్రిడ్జిలను నిర్మించే అంశంపై స్టడీ చేయాలని ఆదేశించారు.
నగరంలో పార్కింగ్ సమస్యల పరిష్కారంపై సీఎం ప్రస్తావించారు. నెక్లెస్ రోడ్డు, రైల్వే స్టేషన్ల సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. అలాగే, నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రైవేటు స్థలాల్లోనూ మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
స్ట్రీట్ లైట్లకు ‘యూనికోడ్’
స్ట్రీట్ లైట్ల నిర్వహణలో పారదర్శకత ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడు నగర పాలక సంస్థలతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణకు ‘యూనికోడ్ సిస్టమ్’ను అనుసరించాలని ఆదేశించారు. పార్కుల వివరాలన్నీ సేకరించి, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు పాలనపై అవగాహన కల్పించేందుకు త్వరలో ‘ఒక్కరోజు శిక్షణ’ తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నగరాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించాలని, ఈ సమావేశానికి తాను స్వయంగా హాజరై వారితో మాట్లాడతానని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
