- మంత్రి కోమటిరెడ్డి వెల్లడి
నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేలా ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రూ.13,000 కోట్ల ప్రతిష్టాత్మక రోడ్డు విస్తరణ పనులకు ఈ నెల 17న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బుధవారం నల్గొండలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, అధికారులతో కలిసి సీఎం సభా ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హ్యామ్ తరహాలోనే రాష్ట్రంలో 6,300 కిలోమీటర్ల రహదారులను 34 ప్యాకేజీల్లో డబుల్ రోడ్లుగా మార్చేందుకు టెండర్లు పూర్తి చేసి వర్క్ ఆర్డర్లు ఇచ్చామని, ఈ శంకుస్థాపన సందర్భంగా నల్లగొండ జిల్లా కనగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం పర్యటన రోజే నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.125 కోట్లతో నిర్మించనున్న కొత్త వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు కూడా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఇదే తరుణంలో, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రాజకీయ కుట్రలతో తిరస్కరించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ ‘సీట్ చోరీ’, ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి ఖండించారు.
విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ఈ అకాడమిక్ విద్యా సంవత్సరం నుంచే ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. తిప్పర్తి మండల కేంద్రంలో రూ.6 కోట్లతో మంజూరైన జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
నాణ్యతతో కూడిన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తిప్పర్తిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేసి, అవసరమైన వసతులు కల్పించి జూలై 1న గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాను తెలంగాణలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా, నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
