ఏపీఎల్ విజేత కోస్టల్ రైడర్స్

ఏపీఎల్ విజేత కోస్టల్ రైడర్స్

ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేతగా కోస్టల్ రైడర్స్ నిలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఫైనల్లో కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. మన్యాల ప్రణీత్ 44 పరుగులు, సీర్ల శ్రీనివాస్ 40 పరుగులతో రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో మనీష్ గోలమోరు, లలిత్ మోహన్ చేరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. 177 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులే చేసి ఓడిపోయింది. 

ఏపీఎల్ విన్నర్ గా నిలిచిన కోస్టల్ రైడర్స్ కు ట్రోఫితో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ బెజవాడ టైగర్స్కు రూ. 15 లక్షల నగదు బహుమతి అందింది. సీజన్లో పది వికెట్లు తీసుకున్న లలిత్ మోహన్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 188 రన్స్ చేసిన ప్యాలా అవినాష్ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు.


 
జులై 6 నుంచి 18 వరకు జరిగిన ఏపీఎల్ లో  మొత్తం ఆరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లన్నింటికీ.. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికయింది.  మెగా ఈవెంట్ లో రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీలు తలపడ్డాయి. ఒక్కో ఫ్రాంఛైజీ 20మంది ప్లేయర్లను తీసుకున్నాయి.