- ఖతార్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 4.9 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- చాక్లెట్ల రూపంలో స్మగ్లింగ్
హైదరాబాద్ సిటీ/శంషాబాద్, వెలుగు: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ. 24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సిబ్బంది పట్టుకున్నారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన భారతీయుడి నుంచి దీనిని సీజ్ చేశారు. ముందుగా ప్రయాణికుడి క్యాబిన్ బ్యాగేజీని తనిఖీ చేయగా, అతని వద్ద ఒక్కోదానిపై 387 గ్రాముల బరువు అని రాసి ఉన్న ఏడు ‘లింట్లిండోర్’ అస్సార్టెడ్ ఫిల్డ్ డార్క్ చాక్లెట్ సెలెక్షన్ ట్యూబ్‌లు కనిపించాయి.
ఆ ట్యూబ్‌లు వాటిపై రాసి ఉన్న బరువు కంటే ఎక్కువగా ఉండడంతో ఆఫీసర్లకు అనుమానం వచ్చింది. వాటిని తెరిచి చూడగా, ఆ ట్యూబ్లలో చాక్లెట్లతో పాటు దాచి ఉంచిన 207 లేత పసుపు రంగులో ఉన్న ఓవల్ (గుండ్రటి/అండాకారం) క్యాప్సూల్స్ బయటపడ్డాయి. వాటిని పరిశీలించి చూడగా ఆ క్యాప్సూల్స్‌లో తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న పదార్థం కనిపించింది. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా చెక్‌చేయగా కొకైన్ అని నిర్ధారణ అయింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, కొకైన్‌ను సీజ్ చేశారు.
సీజ్ చేసిన 4.9 కిలోల కొకైన్ విలువ అంతర్జాతీయ అక్రమ మార్కెట్లో సుమారు రూ. 24.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి డీఆర్ఐ జోనల్ యూనిట్ విచారణ జరుపుతోంది. దోహాలో ఈ కొకైన్‌ను నిందితుడికి ఎవరు అందజేశారు? దీని వెనుక ఉన్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ ఏంటి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ చేరాల్సిన ప్లేస్ ఏంటి? ఇక్కడి నుంచి వేరే నగరాలకు లేదా విదేశాలకు తరలించేందుకు ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకున్నారా? అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు సమాచారం. స్థానిక రిసీవర్ల కోసం నిందితుడి మొబైల్ కాల్ డేటా, చాట్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
