ఎదురు చూపుల్లో సంక్రాంతి ‘పందెం రాయుళ్లు’

ఎదురు చూపుల్లో సంక్రాంతి ‘పందెం రాయుళ్లు’

అమరావతి: సంక్రాంతి అంటే సూర్యుడి గమనం మారే సమయానికి సూచిక.. పంట ఇంటికి చేరిన సంబరంలో రైతన్నలు.. ధాన్య రాశులు, సిరి సంపదల కళకళలు.. తెలుగు లోగిళ్లలో కొత్త అల్లుళ్ల సందళ్లు.. ఇవి మాత్రమేనా.. కాదు, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబురాల్లో ముఖ్య ఘట్టం.. కోళ్ల పందేలు.. పందెం రాయుళ్లు. భీమవరం సహా ఆ చుట్టపక్కల పలు ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందేళ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చూడడానికి వస్తుంటారు. ఏడాది పొడవునా ఏపుగా పెంచిన కోళ్ల యుద్ధం చూసి, వాటిపై పందేలు వేసేవాళ్లు కూడా భారీగా ఉంటారు. కానీ, ఈ ఏడాది ఈ కళ కొంత తగ్గింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో కోళ్ల పందేల నిర్వహణపై పోలీసులు భారీగా నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు.

పోలీసుల పందేలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బరిలో దిగాల్సిన కోళ్లు గంపల కింద ఉండిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి వాటిని చూసేందుకు వచ్చిన వాళ్లు ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో హోటళ్లకే పరిమితమయ్యారు. కోళ్లకు కత్తులు కట్టకుండా పందేల నిర్వహణకు అనుమతి వస్తుందని ముందు ప్రచారం జరిగింది. కానీ, అందుకు కూడా పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు నిర్వాహకులు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో వల్లే కోడి పందేలు జరుగకుండా గ్రామాల్లో పోలీసు, ప్రత్యేక బృందాల నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత అనుమతి వస్తుందని, పందేలు వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. భీమవరంలో  టెంట్లు వేసుకుని పందేలు ఎప్పుడెప్పుడు  మొదలవుతాయా అని జనం భారీగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకూ కోళ్లను బరిలోకి దించని పరిస్థితి ఈ ఏడాది ఎదురైంది. దీంతో ప్రతి ఏడుతో పోలిస్తే ఈ సారి కొంత మేర సంక్రాంతి పందేళ జోరు తగ్గినట్లుగా కనిపిస్తోంది.