న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు ముగిసిపోయాయని అందరూ బావిస్తున్న తరుణంలో దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, తమ పార్టీ దేశవ్యాప్తంగా ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ‘ఎక్స్’ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. గడిచిన 37 రోజులు నిరసన దీక్షలు అత్యంత కష్టతరంగా సాగాయని అభిజీత్ గుర్తుచేసుకున్నారు.
“ఇకపై ఉదయం నిద్ర లేచాక తదుపరి ఏంచేయాలి? సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే టెన్షన్ లేకుండా నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయి మేల్కొనగలుగుతున్నాను. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు’’ అని అభిజీత్ దీప్కే చెప్పారు. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ, అలాగే తమను విమర్శించిన వారికి కూడా అభిజీత్ ధన్యవాదాలు తెలిపారు. విమర్శల వల్లే తాము తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ యువత భవిష్యత్తు కోసం, విద్యావ్యవస్థలోప్రక్షాళన కోసం సీజేపీ పోరాటం ఇకపైనా కొనసాగుతుందని వెల్లడించారు.
