చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం

రాష్ట్రంలో ఉదయం పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభంలోనే చలి వణుకు పుట్టిస్తోంది. అక్టోబర్ లో పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణకు శీతల గాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతే కాకుండా బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా పెరిగిందన్నారు. 

రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయే అవకాశం ఉంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న మెదక్ జిల్లా నాత్నాయిపల్లిలో  8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుందన్నారు. ఇప్పటికే పెరిగిన చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఒణుకు వస్తుందన్నారు. సీజన్ స్టార్టింగ్ లోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా ఉంటుందంటున్నారు. ఉదయం ఆఫీసులకు, పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.