తెలంగాణలో కోల్డ్ వేవ్.. 6.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్లో అయితే..

తెలంగాణలో కోల్డ్ వేవ్.. 6.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్లో అయితే..

హైదరాబాద్: రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. రాత్రి టెంపరేచర్లు దారుణంగా పడిపోవడమే కాదు తెల్లవారు జామున కూడా చలి చంపేస్తోంది. రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉంది. ఇక.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగిల్ డిజిట్లోనే టెంపరేచర్లు నమోదవుతుండటం గమనార్హం. డిసెంబర్ 7 (ఆదివారం) నుంచి 17 వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలిపంజా విసిరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికించింది. మంగళవారం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.

కుమ్రంబీమ్ జిల్లా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లిటి 6.7 డిగ్రీలు, తిర్యానిలో 7.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జీఎస్ ఎస్టేట్ 8.0, బజారాత్నూర్  8.1, రామ్  నగర్  8.3, కెరమేరి 8.2, పోచ్చేర 8.4, సాత్నాల 8.8, సోనాల 8.9, నేరడిగొండ 9.0, పిప్పల్ దరి 9.1, తలమడుగు 9.1, జామ్ 9.2 డిగ్రీలు, వడ్యాల్ 9.3 డిగ్రీలు, వానాల్పాడ్ 9.5 డిగ్రీలు, సిర్పూర్ యు 9.6 డిగ్రీలు, దనోరాలో 9.6 డిగ్రీలు, ఖానాపూర్ 9.6, పాత ఎల్లపూర్ 9.6.. ఇలా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

ఇటు హైదరాబాద్ సిటీలోనూ ఆదివారం నుంచి 10 రోజుల పాటు చలి వణికిస్తుందని అధికారులు చెప్పేశారు. మంగళవారం హైదరాబాద్లోనూ చలి బీభత్సంగా వణికించేసింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో గత రెండు రోజులుగా తెల్లవారు జామునే వాకింగ్ వచ్చే వారి సంఖ్య కాస్త తగ్గింది. ఎక్కువైన చలిని ఎంజాయ్ చేస్తూ జాగింగ్, వాకింగ్ చేస్తామని కొందరు చెప్తుంటే, చలి తీవ్రత వల్ల ప్రతిరోజు వాకింగ్లో కలిసే మిత్రుల సంఖ్య తగ్గిందని మరికొందరు వాకర్స్ తెలిపారు.