ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాకు కృషి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాకు కృషి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి నివేదిస్తామని కలెక్టర్ ఆదర్శ్​సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్​జాబితా అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఎక్కడైనా డబుల్ ఓట్లు ఉంటే తప్పనిసరిగా డిలీట్ చేస్తామన్నారు. వార్డు మ్యాపింగ్ లో తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నారు.

 మున్సిపాలిటీల్లో గ్రామీణ ఓటర్ల పేర్లు నమోదైనా వారిని తొలగిస్తామన్నారు. ఈనెల10న ఫైనల్ జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఓటర్ జాబితా కాపీలను తప్పనిసరిగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   

మార్చిలోపు వార్షిక రుణ ప్రణాళిక పూర్తి

జిల్లాలో నిర్దేశించుకున్న రూ.5339.27 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను వచ్చే మార్చిలోపు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో త్రైమాసిక జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.

 స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాలు వచ్చే మూడు నెలల్లో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఏడాదికి కేవలం రూ.20, రూ.449 చెల్లించే బీమా పాలసీ గురించి చాలా మందికి తెలియదని, అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీవో చేతన్ గోరేకర్, నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, ఎస్ బీఐ ఏడీబీ చీఫ్ కృష్ణమూర్తి, యూబీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.