అశ్వారావుపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అశ్వారావుపేటలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను పరిశీలించి పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం తహసీల్దార్ ఆఫీస్‌ను తనిఖీ చేసి భూభారతి, సాదా బైనామా, భూ సర్వేలకు సంబంధించిన దరఖాస్తులపై ఆరా తీశారు. పెండింగ్ లో దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జూన్ 2 నాటికి పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, హౌసింగ్ ఏఈ మదన్ కుమార్, ఎంపీడీవో రామకోటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
