అకాల వర్షాలపై అలర్ట్గా ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

అకాల వర్షాలపై అలర్ట్గా ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం, వెలుగు: అకాల వర్షాలపై రైతులతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్​అన్నారు. చుంచుపల్లి మండలం పెనగడపలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ బుధవారం సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నాయని, ఈదురుగాలు వచ్చే ప్రమాదం ఉందని, టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్​ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావుతో కలిసి భద్రాచలం ఐటీడీఏలో భద్రా చలం, పినపాక నియోజకవర్గాల్లో నెలకొన్న అటవీ, రెవిన్యూ భూ సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ అటవీ అనుమతులపై సమా వేశం నిర్వహించారు. 

అటవీ అనుమతులు, భూసేకరణ, డీఎల్సీ అనుమతులు, పోడు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయమే కీలకమన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్​, తాగునీరు, మౌలిక సదుపాయాల పనుల్లో ఆలస్యం కాకుండా చూడాలన్నారు. వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 

అర్హులైన గిరిజన రైతులకు పోడు పట్టాలు మంజూరు, వెదురు మొక్కలు అందించి వ్యవసాయం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. పినపాక నియోజకవర్గంలో ఐటీడీఏ పరిధిలో రూ.28.39 కోట్ల పనులు, పంచాయతీరాజ్​ రూ.6.50కోట్ల పనులు, ఆర్​అండ్​బీ శాఖ పరిధిలో రూ.67కోట్ల పనులకు సంబంధించి అనుమతులు పెండింగ్​లో ఉన్నాయని కలెక్టర్​కు వివరించారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్​ మాట్లాడుతూ జిల్లాలో 58 శాతం అటవీ ప్రాంతం ఉన్నందున అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఆయన వివరించారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్ మాట్లాడుతూ ప్రతీ సోమవారం గిరిజన దర్బార్​లో గిరిజనులు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.