టెన్త్  పరీక్షలను సజావుగా నిర్వహించాలి : అనుదీప్ 

టెన్త్  పరీక్షలను సజావుగా నిర్వహించాలి : అనుదీప్ 
  • వివిధ శాఖల అధికారులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు :  టెన్త్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో టెన్త్ వార్షిక పరీక్షలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. మార్చి18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే టెన్త్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాయడానికి భరోసా కల్పించాలని, నిర్ధిష్టమైన ప్రణాళికలతో నిర్వహించాలని సూచించారు.

 పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల ఉంటుండగా..  జిల్లాలో 361( రెగ్యులర్ 349 + ప్రైవేట్12) పరీక్షా కేంద్రాల్లో 76,575 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షలు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖను, సెంటర్ల వద్ద మెడికల్ క్యాంపులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్​లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖను, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.

సెంటర్ల నుంచి జవాబు పత్రాలను భద్రత మధ్య తీసుకువెళ్లేందుకు పోస్టల్ శాఖ సహకరించాలని కోరారు. విద్యార్థులు సమయానికి  కేంద్రాలకు చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  సెంటర్లలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదని కలెక్టర్ స్పష్టంచేశారు. విజయవంతంగా పరీక్షలను నిర్వహిద్దామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్.రోహిణి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె. నర్సింగ్ రావు, ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి .నరసింహ, ఆర్టీసీ డీఎం పీఎస్ జరీన్ హుస్సేన్, డాక్టర్ సుధా మాధవి, పీఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.