అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నయ్ : కలెక్టర్​

అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నయ్ : కలెక్టర్​
  • వెహికల్స్ టైమ్​కు రాలేవని అనడం సరికాదు: కలెక్టర్​
  • ఘటన జరిగిన వెంటనే స్పందించామని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ వద్ద ఫైర్ యాక్సిడెంట్ సంభవించినప్పుడు అంబులెన్స్ లు టైమ్​కు చేరుకున్నాయని, బాధితులకు ఆక్సిజన్ అందలేదని చేస్తున్న కామెంట్లలో నిజం లేదని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన 15 మంది బాధితులను 7 అంబులెన్సులు, 108 వాహనంలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్​కు తరలించామని పేర్కొన్నారు. ఆక్సిజన్ అందిస్తూనే సహాయక చర్యలు అందించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం గురించి 108 జిల్లా కోఆర్డినేటర్ భూమా నాగేందర్​కు వెంటనే తెలియజేసినట్లు పేర్కొన్నారు. ‘‘ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆదివారం ఉదయం 6.17 గంటలకు 108 కాల్ సెంటర్ కు అందింది. 

వెంటనే గోషామహల్ 108 అంబులెన్స్ టీఎస్ 08 యూఎల్ 5682 వాహనం సిబ్బందితో ఉదయం 6.25 గంటలకు ప్రమాద స్థలానికి చేరుకున్నది. అగ్ని ప్రమాద తీవ్రతను గుర్తించి మరో ఆరు 108 వాహనాలను ఘటన స్థలానికి తీసుకొచ్చాం. ముగ్గురు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు 7 అంబులెన్స్ లను పరిశీలించారు. అందులో అవసరమైన ఆక్సిజన్ వసతులు, నిల్వలు ఉన్నట్లు ధ్రువీకరించారు. అంబులెన్స్​లో ఆక్సిజన్ సిలిండర్లు లేవన్న వార్తలను ఖండిస్తున్నాం’’అని కలెక్టర్ అనుదీప్ తెలిపారు.