శామీర్ పేట వెలుగు: లోక్ సభ ఎన్నికలకు అధికారులు రెడీగా ఉండాలని, ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని మేడ్చల్ కలెక్టర్ గౌతం పోట్రు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగమైన అన్ని విభాగాల నోడల్ ఆఫీసర్లు అలర్ట్ గా ఉంటూ విధులను నిర్వర్తించాలన్నారు. అవసరమైన సిబ్బంది డాటా నమోదు పూర్తి చేసి, శిక్షణ ఇవ్వాలని సూచించారు.
సామగ్రి సేకరణ, పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేయాలన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది రవాణాకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంసీఎంసీ కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్, ప్రకటనల ఖర్చును వ్యయ నియంత్రణ కమిటీకి ఎప్పటికప్పుడు పంపాలని, ప్రెస్ మీట్స్ నిర్వహణ, సమాచార లోపం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, నోడల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
