- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నట్టల నివారణతోనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం తెలకపల్లి మండలంలోని చిన్నముదునూరు గ్రామంలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సామూహిక నట్టల నివారణ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 11.25 లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకుసాగాలి..
దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి నెలలో ఒకరోజు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
