కొల్లాపూర్, వెలుగు: గత పాలకుల కారణంగానే తెలంగాణపై భారీ అప్పుల భారం పడిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెంట్లవెల్లి మండలం మాధవస్వామి నగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పంటను అమ్మాలని సూచించారు.
కొనుగోలు వెంటనే రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అయినా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ఆపదని స్పష్టం చేశారు.
