నారాయణపేట, వెలుగు : జిల్లాలో రానున్న వన మహోత్సవం సందర్భంగా 12 లక్షల 71 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వన మహోత్సవం కోసం పొడవాటి పూల, పండ్ల, మల్బరీ మొక్కలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం చిత్తడి నేలలు, డీమ్డ్ ఫారెస్ట్ అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని 375 చెరువులను సర్వే చేసి వారం రోజుల్లోగా వాటి సరిహద్దులను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

