మెదక్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత కీలకమన్నారు. ఫొటో సిమిలర్ ఎంట్రీలను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలన చేసి, అర్హులైన ఓటర్ల వివరాలు సరిచేసి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు బీవీఆర్ఐటీ కాలేజీలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు.
ఇక డివిజన్, మండల కేంద్రాల్లోనూ ప్రజావాణి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి ఆర్డీఓ ఆఫీస్‌లో, మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసులో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అంటేనే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి వినతులు స్వీకరించి వారి సమస్యల్ని పరిష్కరించడం అన్నారు. ప్రజలకు దూర భారాన్ని తగ్గించేందుకు ఈ నెల 5న సోమవారం నుంచి ప్రజావాణి పకడ్బందీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
టెట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నర్సాపూర్: టెట్పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలోని నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీలో టెట్ ఎగ్జామ్ సెంటర్ ను ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష అబ్జర్వర్స్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 200 మంది అభ్యర్థులు టెట్పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని బీవీఆర్ఐటీ కాలేజీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్ష నిర్వహించగా 95 మంది హాజరయ్యారన్నారు వారిలో 65 మంది మొదటి పేపర్‌కు హాజరు కాలేదని, రెండో పేపర్‌కు 40 మంది హాజరు కాలేదని తెలిపారు. ఈరోజు రేపు, పరీక్ష జరగనుందన్నారు.
